ముంబయి 26/11 ఉగ్రదాడుల్ని మనమంతా మర్చిపోలేం. ఆ భయానక రాత్రిని ఎదుర్కొన్నవారిలో ఒకడు – ఎన్ఎస్జీ కమాండో బజరంగ్ సింగ్. అయితే ఇప్పుడతనే… దేశాన్ని కాపాడిన వాడు, ఇప్పుడు డ్రగ్స్ దందాలో దొరికిపోవడం కలకలం రేపుతోంది.
200 కేజీల గంజాయితో..
పోలీసుల సమాచారం ప్రకారం… బజరంగ్ సింగ్ తాజాగా తెలంగాణ, ఒడిశా నుంచి రాజస్థాన్‌కి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి ఏకంగా 200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇది మామూలు విషయం కాదు – అంతర్రాష్ట్ర స్థాయిలో సాగుతున్న భారీ మాదక ద్రవ్యాల రవాణాలో అతడు కీలకపాత్ర పోషిస్తున్నట్టు భావిస్తున్నారు.
క్రిమినల్ గా మారిన కమాండో ?
బజరంగ్ సింగ్ గతంలో BSFలో పనిచేశాడు. తర్వాత NSG (National Security Guard) లో చేరి ఏడేళ్లు విధులు నిర్వహించాడు. ఆ సమయంలోనే – 2008లో జరిగిన ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులను ఎదుర్కొన్న స్పెషల్ ఆపరేషన్‌లో పాల్గొన్నవాడు. అప్పట్లో దేశ రక్షణ కోసం ప్రాణాలని ఫణంగా పెట్టుకొని పని చేసాడు.
ఇలా దిగజారాడు?
కమాండో జీవితం తర్వాత బజరంగ్ సింగ్‌కి రాజకీయాల్లోకి రావాలనిపించింది.
2021లో తన భార్యను లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ కి నిలబెట్టాడు. ఈ ఎన్నికలతో లతో ఈ మాజీ కానిస్టేబుల్ కాంటాక్ట్స్ పెరిగాయి. అదే పరిచయాలు… తర్వాత డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు గా మారినట్టు పోలీసులు చెబుతున్నారు.
అతనిని పట్టుకోవడానికి రాజస్థాన్ ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఏంటీ నేషనల్ టాస్క్ ఫోర్స్ కలిసి స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. నెలలపాటు బజరంగ్ కదలికల్ని గమనించాయి. ఎక్కడికి వెళ్లినా తన సొంత కుక్ (వంటవాడు) ను వెంట తీసుకెళ్లే అలవాటు బజరంగ్ ని పట్టించింది. కుక్ మీద నిఘా పెట్టిన పోలీసులు, రతస్గఢ్ ప్రాంతంలో బజరంగ్ సింగ్‌ను పట్టేశారు.









