పీహెచ్సీలకు ప్రత్యామ్నాయ చర్యలు

0
151

న్యూస్ డెస్క్: సెప్టెంబర్ 30, 2025 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) వైద్యులు పీజీ ఇన్-సర్వీస్ కోటా విషయంలో చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు చికిత్సలో అంతరాయం కలగకుండా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డిఎస్ హెచ్) వైద్యులను పీహెచ్సీలకు పంపాలని నిర్ణయించింది. ఈ చర్యతో రోగులకు సేవలు యథావిధిగా అందుతాయని అధికారులు స్పష్టం చేశారు.

పీహెచ్సీలకు ప్రత్యామ్నాయ చర్యలు

పీహెచ్సీ వైద్యుల సమ్మె నిర్ణయం గ్రామీణ ఆరోగ్య సేవలకు సవాల్‌గా మారింది. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం బోధనాసుపత్రులు, జిల్లా, ప్రాంతీయ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఎంబీబీఎస్ వైద్యులను తాత్కాలికంగా పీహెచ్సీలకు బదిలీ చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం బోధనాసుపత్రుల్లో 1,014 మంది పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు, ఎంబీబీఎస్ ట్యూటర్లు ఉన్నారు. అదేవిధంగా ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో 1,017 మంది వైద్యులు ఉన్నారు. వీరిని మ్యాపింగ్ చేసి ఎంపిక చేసిన పీహెచ్సీలకు పంపే విధంగా సోమవారం రాత్రి ఆదేశాలు వెలువడ్డాయి. దీని వల్ల రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు అందుతాయని అధికారులు తెలిపారు.

ఇన్-సర్వీస్ కోటాపై ప్రభుత్వ వివరణ

ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యుల ఆందోళనలు సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే భవిష్యత్ ఖాళీలను దృష్టిలో ఉంచుకుని 15% క్లినికల్ (7 విభాగాలు), 30% నాన్ క్లినికల్ సీట్లను ఇన్-సర్వీస్ కోటాలో కేటాయించిందని వివరించారు.
రాబోయే మూడు సంవత్సరాల్లో దాదాపు వెయ్యిమంది ఇన్-సర్వీస్ పీజీలు విధుల్లో చేరతారని, ఈ ఏడాది నవంబరు నుంచి దశల వారీగా నియమించబడతారని చెప్పారు. 2027 నాటికి డిఎస్ హెచ్ ఆసుపత్రుల్లో, 2028 నాటికి బోధనాసుపత్రుల్లో ఖాళీలు పూర్తిగా భర్తీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. రోగులకు చికిత్సలో అంతరాయం కలగకుండా వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వైద్య సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు

పీహెచ్సీల్లో పనిచేసే ఇతర సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు పెట్టొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సిహెచ్ ఓలు) ఆరోగ్య-వెల్నెస్ కేంద్రాల్లోనే ఉండాలని స్పష్టం చేసింది. 108 అంబులెన్స్ సిబ్బంది స్థానిక ఆసుపత్రులతో సమన్వయం చేసుకుని అత్యవసర సేవలను అందించాలని ఆదేశించింది.
సోమవారం రాత్రి కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక పరిస్థితులను నిరంతరం గమనించి ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు.

వైద్యుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజలకు చికిత్సలో అంతరాయం లేకుండా వ్యవహరించడం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. పీహెచ్సీ వైద్యులు సమ్మెను విరమించి, వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here