అమరావతి, అక్టోబర్ 4:
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ స్కీం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పూర్వోదయ మిషన్ కింద వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేపట్టాల్సిన ప్రణాళికలను గురించీ సీఎం శనివారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ రంగాల అభివృద్ధి:
ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి చర్యలపై ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన దిశా-నిర్దేశం ఇచ్చారు. ఈ రంగాల అభివృద్ధితో పాటు, వాటిపై ఆధారపడి జీవనం సాగించే రైతులు మరియు వృత్తిపరులు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని చెప్పారు.
ప్రధాన ఉత్పత్తులకు విలువను జోడించడం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించడం, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే విధంగా ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ప్రోత్సహించడం ముఖ్యమంత్రి సూచించారు. ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు పండించడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చూడాలని చెప్పారు.
అంతర్జాతీయంగా హై డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేసి, వాటిని ఎగుమతులకు అనుగుణంగా ఉత్పత్తి చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఏ పంటలకు డిమాండ్ ఎక్కువ ఉంటుందో అంచనా వేయడం ద్వారా రైతులను ఆ పంటల సాగుకు ప్రోత్సహించాలి. అలాగే, రాష్ట్ర వాతావరణానికి అనుగుణంగా పండించగల అన్ని రకాల పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు.
రైతులను పరిశ్రమలకు అనుసంధానం:
ప్రతి రైతును పరిశ్రమలకు అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు ఎలాంటి నష్టం రావడం నివారించవచ్చని తెలిపారు. ఈ క్రమంలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని సూచించారు. కేంద్రం ఎఫ్పీఓలకు ఆర్థిక మద్దతు అందిస్తున్నట్టు వివరించారు.
ఉద్యాన రంగ రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో కలిసి ఒక వర్క్‌షాప్ నిర్వహించి, అన్ని ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ ఏర్పరిచేలా చూడాలన్నారు. అలాగే ఆక్వా ఉత్పత్తులు పెరగడం, ఆక్వా కల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న లాజిస్టిక్స్ పూర్తి వినియోగం ద్వారా రైతులకు మేలైన వనరులు అందించవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సామూహిక పశు షెడ్లు, పశు సంరక్షణ:
రైతు సేవా కేంద్రాల పరిధిలో 2,000 హెక్టార్లలో ఉన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను విశ్లేషించి, రైతులకు అన్ని రకాల అవగాహన కల్పించాలన్నారు. క్లస్టర్ ఆధారంగా పశువుల కోసం సామూహిక షెడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టి, వాటి నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
పశువుల సంఖ్య పెరగడం, పాల ఉత్పత్తి యూనిట్లు, చిల్లింగ్ యూనిట్లు, దాణా బ్యాంకులు, బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, పశు వ్యాధులను తగ్గించే చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు అయ్యే ఎంఎస్ఎంఈ పార్కులలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఉండేలా చూడాలని సూచించారు.
ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



