తెలంగాణ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు స్ట్రాంగ్ వార్నింగ్!
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు.
BreakInGuru, Chennapragada Bhanu · · తెలంగాణ

రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి రాజకీయాలు చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు.
తాగునీటి కష్టాలు, ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు లేవు: రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం గురించి ఏడాది ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. "ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు మాత్రం కనిపించడం లేదు. గత ప్రభుత్వంపై ఉన్న కోపంతో తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే నేడు హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి ఎద్దడి ఏర్పడింది.బోర్లు, బావులు ఎండిపోయి హాస్టల్ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు" అని ఎంపీ ఈటల పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతుల కరువు: ఎండిన పంటల నడుమ చేతికి వచ్చిన కాస్త ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారని ఈటల మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బస్తాలు, కాంటాలు, తార్పాలిన్లు,హమాలీ వ్యవస్థ లేక రైతులు రోడ్డున పడ్డారని విమర్శించారు. కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై చర్చించే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.
'ప్రోగ్రెసివ్ అలయెన్స్' సమ్మిట్‌పై అభ్యంతరం: హైదరాబాద్ వేదికగా నిర్వహించిన 'ప్రోగ్రెసివ్ అలయెన్స్' సదస్సుపై ఈటల రాజేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికో, పరిశ్రమల స్థాపనకో కాకుండా.. అంతర్జాతీయ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీని, దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను విమర్శించడానికే ఈ సదస్సును వాడుకున్నారని ఆరోపించారు.పార్లమెంటులో వాస్తవాలు మాట్లాడే ధైర్యం లేని రాహుల్ గాంధీ, బయట అబద్ధాలతో దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందని, ఇతర దేశాల్లో జరిగినట్లు భారత్‌లో అశాంతి సృష్టించాలనే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.
కాంగ్రెస్ పాలనపై విమర్శలు, 2028 ఎన్నికలపై జోస్యం: సోనియా గాంధీ పుస్తకంలోని అంశాలు వాస్తవ దూరమని, నెహ్రూ కాలం నుంచి యూపీఏ హయాం వరకు జరిగిన కుంభకోణాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఈటల అన్నారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ఎలాంటి మచ్చ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కంటే ఢిల్లీ పెద్దలకు నిధులు సమకూర్చడంపైనే రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ ఉందని ఆరోపించారు. ఇదే తీరు కొనసాగితే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని,ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీను, మండల అధ్యక్షులు గుంటిపల్లి సత్యం, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కర్రె ప్రవీణ్ కుమార్,మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్, మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.