ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తెచ్చేది.. ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని, ప్రజలు అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తెచ్చిన వెంటనే ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు, రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాలేపల్లి మురళీధర్‌ పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. స్ధానిక కృష్ణనగర్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో బాలేపల్లితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆకుల భాగ్యసూర్యలక్మి, ముళ్ల మాధవ్‌ మాట్లాడారు.

ప్రత్యేక హోదా సాధనకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిళారెడ్డి ఆధ్వర్యంలో ఢల్లీిలో ఈనెల 2వ తేదీన జరిగిన ధర్నా విజయవంతమైందని, రాష్ట్రం నుంచి పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. 25 ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌, ఐదేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీతో అంటకాగిన టీడీపీ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై ప్రజల్ని తీవ్రంగా మోసం చేసాయన్నారు. కాంగ్రెస్‌ ప్రత్యేకంగా చట్టాన్ని చేసి నష్టపోతున్నా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ప్రయత్నిస్తే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటిని తుంగలో తొక్కిందన్నారు. బీజేపీ అంటే బాబు.. జగన్‌.. పవన్‌ అంటూ విమర్శించారు. బీజేపీ, చంద్రబాబు ఆడిన డ్రామాలు ప్రజలు గ్రహించారని, ప్రత్యేక హోదాకై అలుపెరగని పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రయత్నాలు సఫలం అవుతాయన్నారు.

ప్రత్యేక హోదా ఎపికి సంజీవినిగా మారుతుందన్నారు. పరిశ్రమల స్ధాపన, యువతకు ఉపాధి, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో అన్నాచెల్లెళ్ల వైరం నడుస్తోందని, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయ సాధనకు కృషిచేస్తున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిళారెడ్డికి ప్రజలు మద్ధతుగా నిలవాలని కోరారు. ప్రజలు నిదానంగా ఆలోచించి తమకు మేలుచేసే కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. డిల్లీలో నిర్వహించిన నిరసన ద్వారా ఆంధ్రుల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. సమావేశంలో పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్‌ నాయకులు చామర్తి లీలావతి, బత్తిన చంద్రరావు, యిజ్జరౌతు విజయలక్ష్మి, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.