- ఉద్యోగుల తొలగింపులో దూకుడు పెంచినటెక్ కంపెనీలు
- ఈ నెలలో ఇప్పటికే 65 వేల మంది ఇంటికి…
- మాంద్యం భయంలో కంపెనీలు
కొత్త సంవత్సరంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మరింత వేగం పుంజుకొన్నది. ఆర్థిక మాంద్యం భయాందోళనలతో కంపెనీలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ లేఆఫ్ దారిలో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి బడా సంస్థలు కూడా చేరాయి. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జనవరిలో రోజుకు సరాసరిన దాదాపు 3 వేల మంది టెక్ ఎంప్లాయీస్పై వేటు పడింది. ఈనెల 22వ తేదీ(ఆదివారం) వరకు 166 టెక్ కంపెనీలు 65 వేల మంది ఉద్యోగులకు పైగా తొలగించాయి. 12 వేల మందిని తొలగిస్తున్నట్టు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐటీ సర్వీసుల దిగ్గజ సంస్థ విప్రో కూడా తాజాగా 450 మంది ఫ్రెషర్లపై వేటు వేసింది.
అమెరికా మీడియా సంస్థలపైనా ప్రభావం:
ఆర్థిక మాంద్యం భయాందోళనల ప్రభావం అమెరికా మీడియా సంస్థలపై కూడా పడింది. ఈ శీతాకాలంలో పలు సంస్థలు ఉద్యోగుల తొలగింపు ప్రకటించాయి. ఈ జాబితాలో సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్టు వంటి మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. 7 శాతం సిబ్బందిని తొలగించనున్నట్టు వోక్స్ మీడియా సీఈవో జిమ్ బ్యాంకాఫ్ గత శుక్రవారం ప్రకటించారు. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. సీఎన్ఎన్, ఎన్బీసీ, ఎంఎస్ఎన్బీసీ, బజ్ఫీడ్ వంటి సంస్థల్లో తొలగింపుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో ఉద్యోగులను సీఎన్ఎన్ తొలగించినట్టు అమెరికా మీడియా పేర్కొన్నది. సమీప భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఉంటుందని వాషింగ్టన్ పోస్టు సీఈవో ఫ్రెడ్ ర్యాన్ గతనెలలో హెచ్చరించారు.
ఉద్యోగం వదిలేసి టెక్నాలజీ రూపొందిద్దాం:
ఐటీ ఉద్యోగం నుంచి తీసేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఉద్యోగాన్ని వదిలి సొంతంగా టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు సిద్ధం కావాలంటూ’ రాహూల్ మహేశ్వరి అనే ఐటీ ఉద్యోగి సోషల్మీడియాలో చేసిన పోస్టు వైరల్గా మారింది. మన దేశానికి గతం కంటే ఎక్కువగా గూగుల్, అడోబ్, లింక్డిన్ వంటి కంపెనీల అవసరం ఉంది. ఇలాంటివి రావాలంటే అందరం కలిసి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఇప్పటికే ‘లైనక్స్ సోషల్స్’ పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించానని, దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా మనదేశానికి ఎంతో మేలు చేస్తుందని, దీంట్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.