Latest Posts

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి కసరత్తు

 

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరో విడత నోటిఫికేషన్‌ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి మంజూరు చేయడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే. 2019 జూలై – అక్టోబర్‌ మధ్య మొదటి విడతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం భారీగా నియామక ప్రక్రియ నిర్వహించింది.అప్పట్లో మిగిలిపోయిన ఉద్యోగాలకు 2020 జనవరిలోనే రెండో విడత నోటిఫికేషన్‌ జారీ చేసి, కరోనా సమయంలో కూడా ఆ ఏడాది సెపె్టంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు చేస్తోంది. గత రెండు విడతల మాదిరే.. ఈ సారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించింది. అయితే, గత రెండు విడతల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆఫ్‌లైన్‌ (ఓఎమ్మార్‌ షీట్‌– పేపర్, పెన్ను) విధానంలో నిర్వహించగా.. ఈ విడతలో మాత్రం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహణకు పంచాయతీ రాజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది.

Latest Posts

Don't Miss