Latest Posts

శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ ఉత్సవం

 

శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ ఉత్సవం 

నామస్మరణ, అర్చన, అభిషేకం, హోమం వంటివే కాకుండా భూప్రదక్షిణ కూడా దైవారాధనతో సమానమే. ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ ప్రాంతమంతా దైవస్వరూపంగా భావించి, చుట్టూ ప్రదక్షిణం చేయడం మన సంప్రదాయం. దక్షిణకైలాసం అయిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంక్రాంతి మరునాడు కనుమ నాడే శ్రీకారం. ఆరోజున స్వామి, అమ్మవార్లు నందివాహనారూఢులై గిరిప్రదక్షిణ మార్గంలో ఊరేగుతూ తమ కల్యాణానికి దేవతలను, సిద్ధులను, సాధుసత్పురుషులను స్వయంగా ఆహ్వానిస్తారు. భక్త కన్నప్పకు ఆహ్వానపత్రికను అందిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం జరిగిన తరువాత వారే మళ్లీ మరోసారి పిలిచినవారందరికీ వీడ్కోలు పలుకుతారు. స్వామి అమ్మవార్లు చేసే ఈ గిరిప్రదక్షిణను భక్తులు ప్రతిమాసంలోనూ పౌర్ణమినాడు సాధారణంగా చేస్తుంటారు. అరుణాచల గిరిప్రదక్షిణ వలె శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ కూడా ప్రాచీనకాలం నుంచి ఉన్నప్పటికీ ఈ మార్గం మాత్రం అంతటి ప్రసిద్ధం కాలేదు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉండే గిరిప్రదక్షిణ మార్గంలో ఇప్పటికీ కొంతదూరం తారురోడ్డులోనూ, మరికొంతదూరం మట్టిరోడ్డుపైనా ప్రయాణించవలసి వస్తోంది. శ్రీకాళహస్తి ప్రధానాలయం తూర్పుద్వారం అయిన నాలుగోనెంబర్ గేటు దగ్గర గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు. సవ్యమార్గంలో ఉత్తరంవైపు నడిచి చివరకు దక్షిణద్వారం మీదుగా నాలుగో గేటువద్దకు రావడంతో గిరిప్రదక్షిణ పూర్తవుతుంది. ఈ ప్రదక్షిణ మార్గంలో శ్రీశైలంలోని భరద్వాజ తీర్థం వంటి దాదాపు 30 తీర్థాలు మనకు కనిపిస్తాయి. కన్నప్ప గుడికొండను చుట్టి, వేయిలింగాల కోన, హరిహరతీర్థం, దక్షిణకాళీ కొండలను చుట్టుకుంటూ ఈ గిరిప్రదక్షిణ కొనసాగుతుంది.

Latest Posts

Don't Miss