Latest Posts

వాల్తేరు వీరయ్య అస‌లు క‌థంతా ద్వితీయార్ధంలోనే

 

  • ద్వితీయార్ధంలోనే అస‌లు క‌థంతా వాల్తేరు వీరయ్య.
  • చిరంజీవి చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ అవ‌తారంలో కనిపించనున్నారు.
  • చిరంజీవి, రవితేజ కీలక పాత్రల్లో నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ

వాల్తేరు వీరయ్య నటీనటులు

చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్‌, కేథరిన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, బాబీ సింహా, నాజర్‌, సత్యరాజ్‌, వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, షకలక శంకర్‌, ప్రదీప్‌ రావత్‌ తదితరులు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; సినిమాటోగ్రఫీ: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, ఎడిటింగ్‌: నిరంజన్‌ దేవరమన్నె నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, కె.చక్రవర్తి, కథ, దర్శకత్వం: కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) విడుదల: 13-01-2023

సంక్రాంతి పండగకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవిలాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే, ఆ క్రేజ్‌ మరింత ఎక్కువగా ఉంటుంది. ‘ఆచార్య’ ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ ‘వాల్తేరు వీరయ్య’పైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలను పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి వింటేజ్‌ మాస్‌ లుక్‌లో ఏ మేరకు మెప్పించారు?

క‌థేంటంటే

స‌ముద్రం ఆనుపానులు తెలిసినవాడు వాల్తేరు వీర‌య్య (చిరంజీవి). అవ‌స‌ర‌మైన‌ప్పుడు నేవీ అధికారుల‌కి కూడా సాయం చేస్తుంటాడు. పోర్ట్‌లో ఐస్ ఫ్యాక్ట‌రీ అత‌ని పేరుమీదే న‌డుస్తుంటుంది. మలేషియాలో డ్ర‌గ్ మాఫియాని న‌డుపుతున్న సాల్మ‌న్ సీజ‌ర్ (బాబీ సింహా) వ‌ల్ల పోలీస్ అధికారి సీతాప‌తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) స‌స్పెండ్ అవుతాడు. ఎలాగైనా సాల్మ‌న్‌ని మ‌లేషియా నుంచి తీసుకురావాల‌ని, అందుకు త‌గిన వాడు వీర‌య్యేనని సీతాప‌తి తెలుసుకుంటాడు. అందుకోసం రూ. 25 ల‌క్ష‌ల‌కి ఇద్ద‌రి మ‌ధ్యా ఒప్పందం కుదురుతుంది. అలా మ‌లేషియా వెళ్లిన వాల్తేరు వీర‌య్య అక్క‌డ సాల్మ‌న్ సీజ‌ర్‌తోపాటు, అత‌ని అన్న కాలా అలియాస్ మైఖేల్ సీజ‌ర్ (ప్ర‌కాశ్‌రాజ్‌)కి ఎర వేస్తాడు. ఇంత‌కీ మైఖేల్‌కీ, వీర‌య్య‌కీ సంబంధం ఏమిటి?. నిక్క‌చ్చిగా విధులు నిర్వ‌ర్తిస్తూ వీర‌య్య‌ని కూడా శిక్షించిన ఏసీపీ విక్ర‌మ్‌సాగ‌ర్ (ర‌వితేజ‌) గ‌తమేమిటి? మైఖేల్‌పై వీర‌య్య పోరాటం ఎలా సాగింద‌నేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే

అగ్ర తార‌లు వాళ్ల‌ని అభిమానించే ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌డానికే ఇష్ట‌ప‌డుతుంటారు. వాళ్ల‌కున్న బ‌ల‌మైన ఫ్యాన్ బేస్‌ని మెప్పించేలా సినిమాలు తీయ‌గ‌ల‌ర‌నే ఓ న‌మ్మ‌కం. దాన్ని, ఆ కొల‌త‌ల‌కి త‌గ్గ‌ట్టే యువ ద‌ర్శ‌కులు సినిమాలు రూపొందిస్తుంటారు. కొత్త క‌థలు చెప్ప‌డం కంటే త‌న అభిమాన హీరోని ప్రేక్ష‌కులు ఎలా చూడటానికి ఇష్ట‌ప‌డ‌తారో, త‌న హీరో ఎలాంటి స‌న్నివేశాల్లో క‌నిపిస్తే అభిమానుల‌కు పూన‌కాలు వ‌స్తాయో అంచ‌నాలు వేసి వాటి మ‌ధ్య క‌థ‌ల్ని అల్లుతుంటారు. ‘వాల్తేరు వీర‌య్య‌’ కూడా అవే కొల‌త‌లతో సాగుతుంది. ఊర మాస్ అవ‌తారంలోనూ త‌న మార్క్ కామెడీ, యాక్ష‌న్ అంశాల‌తో చిరంజీవి సినిమా చేసి చాలా కాల‌మైంది. మ‌ళ్లీ ఆ ఇమేజ్‌ని తెర‌పై చూపించాల‌నే తప‌నే బాబీలో ఎక్కువ‌గా క‌నిపించింది. మంచి ఎలివేష‌న్స్‌తో చిరంజీవి ఒక‌ప్ప‌టి అవ‌తారాన్ని గుర్తు చేశాడు ద‌ర్శ‌కుడు. క‌థ మ‌లేషియాకి వెళ్లాక అక్క‌డక్కడా చిరంజీవి మార్క్ కామెడీపైనే ప్ర‌ధానంగా స‌న్నివేశాలు సాగుతాయి. వెన్నెల కిషోర్‌, చిరంజీవి, ఆయ‌న గ్యాంగ్ మ‌ధ్య స‌న్నివేశాలు న‌వ్విస్తాయి. శ్రుతిహాస‌న్ పాత్ర‌ని అక్క‌డే ప్ర‌వేశ‌పెట్టి పాట‌ల‌కీ చోటు క‌ల్పించారు. విరామానికి ముందు అస‌లు క‌థ‌లోకి వెళుతుంది సినిమా. ఆ స‌మ‌యంలో వ‌చ్చే పోరాట ఘ‌ట్టాలు కూడా సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి.

ద్వితీయార్ధంలోనే అస‌లు క‌థంతా..

విక్ర‌మ్ సాగ‌ర్‌గా ర‌వితేజ ఎంట్రీ. వీర‌య్య‌తో వైరం ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. పోలీస్ పాత్ర‌లో ర‌వితేజ ఉంటే ఆ హంగామా ఎలా ఉంటుందో ఇందులోనూ క‌నిపించింది. అయితే వీర‌య్య‌, విక్ర‌మ్ సాగ‌ర్ మ‌ధ్య బంధం నేప‌థ్యంలో భావోద్వేగాలు బ‌లంగా పండించే అవకాశం ఉన్నా, ఆ దిశ‌గా చేసిన క‌స‌ర‌త్తులు చాల‌లేద‌నిపిస్తుంది. చిరంజీవి, ర‌వితేజ వాళ్ల పాత సినిమాల్లోని ఒక‌రి డైలాగుల్ని మ‌రొక‌రు చెప్ప‌డం, పూన‌కాలు లోడింగ్ పాట‌లో క‌లిసి చేసిన డ్యాన్సులు మాత్రం అభిమానుల్ని అల‌రిస్తాయి. జారు మిఠాయ పాట‌నీ, చేసే మూడు ఉత్సాహం వంటి ప్రాచుర్యం పొందిన మాట‌ల్ని ఇందులో చిరంజీవి వాడిన విధానం న‌వ్విస్తుంది. వింటేజ్ చిరంజీవి కనిపించినా, అభిమానుల్ని మెప్పించే అంశాలున్నా, ర‌వితేజ సంద‌డి చేసినా క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. రిస్క్‌ జోలికి పోకుండా, చిరు అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకుని పాత క‌థ‌ని అంతే పాత ప‌ద్ధ‌తుల్లో చెప్పాడు ద‌ర్శ‌కుడు.

ఎవ‌రెలా చేశారంటే:

చిరంజీవి చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ అవ‌తారంలో క‌నిపించారు. లుక్‌తోపాటు కామెడీలో ఆయ‌న టైమింగ్, రెండు పాటల్లో ఆయ‌న డ్యాన్సులు, పోరాట ఘ‌ట్టాలు అల‌రిస్తాయి. చిరంజీవి త‌న న‌ట‌న‌తో అభిమానుల‌కి పూన‌కాలు తెప్పించారు. ఏసీపీ విక్ర‌మ్ సాగ‌ర్ పాత్ర‌కి ర‌వితేజ బ‌లాన్నిచ్చారు. ఆ పాత్ర కోసం ఆయ‌న్ని ఎంపిక చేసుకోవ‌డం స‌రైన నిర్ణ‌యం. ద్వితీయార్ధంలో చిరంజీవి, ర‌వితేజ మ‌ధ్య బంధం, ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. క‌థానాయిక‌లకి పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. శ్రుతిహాస‌న్ పోరాట ఘ‌ట్టాల్లోనూ క‌నిపిస్తుంది. కేథ‌రిన్ కొన్ని స‌న్నివేశాల‌కే ప‌రిమిత‌మైంది. ప్ర‌కాశ్‌రాజ్‌, బాబీ సింహా పాత్ర‌ల్లో బ‌లం లేదు. వెన్నెల కిషోర్‌, స‌త్య‌రాజ్ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, శ్రీనివాస్‌రెడ్డి, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

Latest Posts

Don't Miss