ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి -మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని మధ్యవర్తిత్వం, దళారీతనం లేని సంక్షేమాన్ని నేరుగా పేదలకు చేరవేయడంలో జగన్ సేవలు అమోఘమని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ‘వైస్సార్ పింఛన్ల’ పంపిణీ వారోత్సవాల్లో భాగంగా గురువారం కూడేరు మండలం కొర్రకోడు గ్రామంలో నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది. ఈ కార్యక్రమాని ముఖ్య అతిథిగా విశ్వేశ్వరరెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా లబ్ధిదారులు, నాయకులతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మండలం నూతనంగా మంజూరైన 200 కొత్త పింఛన్లను లబ్ధిదారులకు అందజేసారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేరువచేయడంలో లబ్దిదారులకు, ప్రభుత్వానికి అనుసంధాన వ్యవస్థగా గ్రామ, వార్డు సచివాలయం, వాలంటీర్లు వ్యవస్థను ఏర్పాటుచేసి, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందింపజేశారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల కోసమే వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెట్టే గత రాజకీయాలకు పాతరవేసి, సరికొత్త ఒరవడికి జగన్ శ్రీకారం చుట్టారన్నారు.ప్రజలు దీన్ని గమనించాలన్నారు.ఇచ్చిన మాట కోసం ఎంతైనా కష్టపడే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం ప్రజల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల ప్రజాప్రతినిధులు,వైస్సార్సీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.