Latest Posts

పిరికితనంతో తప్పుడు కేసులు పెడుతున్న జగన్‌ ప్రభుత్వం-చంద్రబాబు

 

పిరికితనంతో తప్పుడు కేసులు.. ఏపీలో అత్యవసర పరిస్థితి: చంద్రబాబు

సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని.. పిరికితనంతో తప్పుడు కేసులు పెట్టి తమ పర్యటనలను అడ్డుకోవాలనుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కొంతమంది పోలీసులు వాళ్ల స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అత్యవసర పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. కుప్పంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలు బాధపడుతుంటే శాడిస్ట్‌ సీఎం ఆనందపడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. రోడ్డు షోలు, సభలపై నియంత్రణకు చీకటి జీవో తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అరాచకశక్తిగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసులు తీసుకెళ్లిన తెదేపా చైతన్య రథం వాహనాన్ని వెంటనే తిరిగివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లినందుకు నిరసనగా ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఎం.ఎం. కల్యాణ మండపం వరకు చంద్రబాబు పాదయాత్రగా వెళ్లారు.

రోడ్డు షోలు రాష్ట్రానికి కొత్తా? :

‘‘40 ఏళ్లు పోరాడిన పార్టీ తెదేపా. ఎన్నో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కొన్నాం. రాష్ట్రాన్ని అంధకారం చేయకూడదని పోరాడుతున్నాం. తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎవరు కనపబడితే వాళ్లపై కేసు పెట్టి జైల్లో పెడతారా? నేను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, షర్మిల, జగన్‌ పాదయాత్రలు చేశారు. ఆ పాదయాత్రలకు పోలీసు భద్రత కల్పించా. ఇప్పుడు వీళ్లు మాత్రం నా నియోజకవర్గంలో నేను తిరుగుతుంటే అడ్డుపడుతున్నారు. దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. పోలీసు వ్యవస్థలో కొందరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడే ఈ పోరాటంలో పోలీసుల సహకారం అవసరం. చట్టాలను అతిక్రమించిన పోలీసులూ నేరస్థులే. జిల్లా ఎస్పీ లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడేందుకు వచ్చారా? తెదేపా కార్యకర్తలపై దాడులకు వచ్చారా? రోడ్డు షోలు రాష్ట్రానికి కొత్తా? గత 70 ఏళ్ల నుంచి జరగలేదా? జగన్‌ పాదయాత్రలో రోడ్డుషోలు జరగలేదా?

పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతాం. బోనెక్కిస్తాం

తెదేపా నేతలు బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు చేసిన కుట్రలో భాగంగానే కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయి. ఇప్పుడు కుప్పంలోనూ ఆ తరహాలోనే చేస్తున్నారు. ఏంటీ అరాచకాలు? అయినా మేం భయపడం.. ప్రజాపోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. పోలీసు వ్యవస్థపై కేసులు పెడతాం. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టి బోనెక్కిస్తాం. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనుకుంటే.. మీకూ కుటుంబాలు ఉన్నాయి. వాళ్లు బాధపడితే తెలుస్తుంది. 5 కోట్ల మంది ప్రజలు ఒకవైపు.. జగన్‌ మరో వైపు. వైకాపా నేతలు రాష్ట్రాన్ని కాపాడతారా? సైకో పక్కన ఉంటారా?వాళ్లే ఆలోచించుకోవాలి’’ అని చంద్రబాబు అన్నారు.

Latest Posts

Don't Miss