Latest Posts

ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం – మంత్రి ఆర్కే రోజా

  • లోకేష్ పాదయాత్ర ఆయన డైటింగ్ లో భాగమే..
  • కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్ కల్యాణ్ స్పందించరేం..

“చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ.. ఇప్పటికీ మూడు ఘటనల్లో 40 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. డ్రోన్ కెమెరాల షాట్ల కోసం సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. అయినా, దీనిపై ఏ పార్టీ, ఏ మీడియా డిబేట్లలో విమర్శలు చేయకపోవడం చాలా ఆశ్యర్యంగా ఉంది. వీళ్లంతా చంద్రబాబు గింజలకు ఆశపడి ఏం మాట్లాడటం లేదని తెలుస్తోంది. చంద్రబాబుకు మనవడితో ఆడుకోవాల్సిన వయసులో ఈ పబ్లిసిటీ పిచ్చి ఏంటో నాకు అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న కందుకూరులో 8 మంది చనిపోయినా.. మళ్లీ ఇంకో కార్యక్రమం ఎందుకు నిర్వహించారు. ఈ ఘటనలపై ప్రభుత్వం తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటుంది” అని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.

పవన్ కల్యాణ్ మాట మూగబోయిందే… ?

పబ్లిసిటీ పిచ్చితో జనాలను చంపుతున్నా పవన్ కళ్యాణ్ మాట్లాడరేమని ప్రశ్నించారు. ఇప్పటం గ్రామంలో అక్రమంగా నిర్మించిన గోడను కూల్చితేనే హుటాహుటిన వచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రాబు పబ్లిసిటీ స్టంట్స్ లో 11 మంది చనిపోయినా మాట్లాడకపోవడానికి కారణం ఏంటని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. కందుకూరు, గుంటూరు ఘటనల ప్రస్తావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వారి ప్రచార యావ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ఏంటని ప్రశ్నించారు.

దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి రెండు అసెంబ్లీ ఎన్నికలు పూర్తైనా ఇంకా చంద్రబాబు సంకలోనే ఉన్నారని విమర్శించారు. ఇప్పటంలో ప్రభుత్వం అధికారికంగా ముందస్తు నోటీసులు ఇచ్చి గోడలు కూల్చితే.. రౌడీ లాగా హడావుడి చేసి.. కోర్టుకు జరిమానా కట్టే వరకు తెచ్చుకున్నాడు. కానీ, ఇప్పుడు చంద్రబాబు తన రాజకీయ ప్రచార యావ కోసం ఎన్నో ప్రాణాలు బలి తీసుకుంటున్నా ఒక్క మాట కూడా విమర్శించకపోవడం ఎంత దారుణమన్నారు. పవన్ కల్యాణ్ అనేది ప్యాకేజీలకు తప్ప పాలిటిక్స్ కు పనికి రాడని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ కు 151 సీట్లు గెలిచిన జగన్ తో పోటీయా

చంద్రబాబు సీఎంగా ఉండగా మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ 151 సీట్లు గెలిచిన సీఎం జగన్ తో పోటీపడాలని చూడటం హాస్యాస్పదమన్నారు. లోకేష్ ను ఎమ్మెల్సీగా చేసిన మొట్టమొదటి రోజే వాళ్ల నాన్నకు ఓటుకునోటు కేసులో నోటీసులు వచ్చాయి. దీంతో లోకేష్ ఎంట్రీతో ఇంకా ఏం జరుగుతుందోనని టీడీపీ క్యాడర్ అంతా భయపడుతోంది. లోకేష్ పాదయాత్ర ప్లాన్ ఆయన డైటింగ్ లో భాగమే. ఈ పాదయాత్రతో టీడీపీకి ఓరిగేదేం లేదు అని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.

చంద్రబాబు హయాంలో చేసిన అప్పులో కేవలం 60 శాతం అప్పుతో అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం జగన్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని మంత్రి రోజా పేర్కొన్నారు. అమ్మ ఒడి, నాడు నేడు, వంటి అద్భుతమైన పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. సీఎం జగన్ అప్పు తక్కువ సంక్షేమం ఎక్కువ. చంద్రబాబు హయాంలో అప్పు ఎక్కువ సంక్షేమం తక్కువ. కానీ ప్రతిపక్షం పనికిమాలిన సభలు, తన పబ్లిసిటీ స్టంట్లతో ప్రజలను డిస్టర్బ్ చేస్తోంది. రాష్ట్రంలో 2024 లో జరగబోయే ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు కోరుకుంటున్నారని అని రోజా స్పష్టం చేశారు.

Latest Posts

Don't Miss