Latest Posts

ప్రజలలో పించన్లపై ప్రతిపక్షాలు అపోహలు రేపుతున్నాయి-అనంత వెంకటరామిరెడ్డి

 

– ప్రజలకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపు
– అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్‌ తొలగించం
– జనవరిలో గతం కంటే ఎక్కువగా పింఛన్ల పంపిణీ
– వెరిఫికేషన్‌ ప్రక్రియ అనేది సర్వసాధారణం
– మంచి చేస్తుంటే సైంధవుల్లా అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు.

పేదలకు మంచి చేయాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. వాటిని ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్‌ కూడా తొలగించడం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని 49, 50 డివిజన్లలో కార్పొరేటర్లు మునిశేఖర్, శేఖర్‌బాబుతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ బుక్‌టెట్లు అందజేశారు. స్థానికంగా సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మూడున్నరేళ్లలో ఏకంగా రూ.3.30 లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించామన్నారు. ఎక్కడా వివక్ష చూపకుండా పార్టీలకు అతీతంగా పథకాలు నేరుగా గడప వద్దకే చేర్చామని, అర్హతే ప్రామాణికంగా అందిస్తున్నామన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో జగన్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండడంతో ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 2019 నాటికి రాష్ట్రంలో 39 లక్షల మందికి పింఛన్లు వస్తుంటే ఈరోజు ఏకంగా 65 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. పింఛన్ల రీవెరిఫికేషన్‌ ప్రక్రియ సర్వసాధారణమని, కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం పింఛన్లు తొలగిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని పత్రికలు కూడా తాటికాయంత అక్షరాలతో రాతలు రాస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా వార్తలను ఎవరూ నమ్మవద్దన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జనవరిలో రూ.2750 పింఛన్‌ అందిస్తామన్నారు. గత నెల కంటే ఎక్కువ మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఏ సంక్షేమ కార్యక్రమం ఆగదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించని పార్టీలు ఇప్పుడు పేదలకు మంచి జరుగుతుంటే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని అన్నారు. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలదేనని తెలిపారు. పేదలకు పింఛన్, అమ్మ ఒడి, చేయూత వంటి పథకాలు అందిస్తుంటే అడుగడుగునా సైంధవుల్లా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు.కార్యక్రమంలో మేయర్ వసీం సలీమ్,డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,కోగటం విజయభాస్కర్ రెడ్డి,కమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss