రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? … మారుతున్న రాజకీయ పరిణామాలతో ఆయన తిరిగి ప్రత్యక్షరాజకీయాల్లో రావడం మంచిదనే ఆలోచనలో ఉన్నారా? అంటే…ఔననే సమాధానం వస్తోంది… గతంలో ఆయన విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున వరుసగా ప్రాతినిథ్యం వహించారు… అయితే రాష్ట్ర విభజన తర్వాత వైరాగ్యంతో పాలిటిక్స్‌కి దూరమయ్యారు.. మరిప్పుడు ఆయన రీఎంట్రీ వెనుక లెక్కలేంటి?… ఏ పార్టీతో ఆయన టచ్‌లో ఉన్నారు?
లగడపాటి రాజగోపాల్… లాంకో రాజగోపాల్‌గా సుప్రసిద్దుడైన పారిశ్రామికవేత్త.. ఆయన తన మామ మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర వారసత్వాన్ని అందిపుచ్చుకుని విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెసు ఎంపీగా ఎన్నికయ్యారు… ఆయనకు చెందిన లాంకో గ్రూపు విద్యుతుత్పత్తి, చిత్ర నిర్మాణం, ఇతర రంగాలలో కృషిచేస్తుంది…. హైదరాబాద్‌లో లాంకో హిల్స్ ఇప్పుడు పెద్ద లాండ్ మార్క్‌గా మరింది..
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే అభిమానం పెంచుకున్న రాజగోపాల్ … వైఎస్ పాదయాత్రలో అడుగులో అడుగు వేసిన ఇద్దరు ముగ్గురు నేతల్లో ఆయన ఒకరు … అందుకే వైఎస్ టైంలో ఆయన హవా కూడా ఒక రేంజ్లో నడిచింది.. విజయవాడ ఎంపీగా వరుసగా గెలిపించింది… ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోడానికి వీరోచిత పోరాటం చేసిన నాయకుడిగా లగడపాటికి పేరుంది…
లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం సమయంలో తెలంగాణ ఎంపీల కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి ఆయన సృష్టించిన రభస ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదరు… ఒకవేళ తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అప్పట్లో ఆయన ప్రతిజ్ఞ చేశారు…. అన్నట్టుగానే ఆయన రాజకీయ సన్యాసం స్వీకరించి 2014 ఎన్నికల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు …
అయితే 2004 నుంచి ఆయన ఎన్నికల సర్వేలు చేస్తున్నారు…. సర్వేలు చేయడం ఆయనకు హాబీ …. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి వ్యతిరేక రిపోర్టులు వచ్చినా చెప్పేవారు…. కాంగ్రెస్ నాయకుడై ఉండి కూడా నిష్పక్షపాతంగా చెబుతారనే మంచి పేరు తెచ్చుకున్నారు…. కానీ 2019లో ఏపీ ప్రజానీకం నాడిని పట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారు… మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆయన కీలక ప్రెస్‌నోట్ విడుదల చేశారు. .. 2014 నుంచి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు ప్రకటించానని … అప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు …. 2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తాను చేసిన సర్వేలు ఘోరంగా విఫలమయ్యాయని … ప్రజల నాడిని పట్టుకోలేకపోయిన కారణంగా ఇకపై సర్వేలు చేయనని స్పష్టం చేశారు.
అప్పటి నుంచి లగడపాటి అడపాదడపా కనిపించడం తప్ప, ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి …. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేశ్‌తో ఇటీవల లగడపాటి భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం… రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి లగడపాటి బరిలో దిగనున్నట్టు తెలిసింది …. ప్రస్తుతం అక్కడ టీడీపీ నాయకుడు కేశినేని నాని ప్రాతినిథ్యం వహిస్తున్నారు… అయితే కేశినేనికి స్థానిక నేతలందరితో విభేదాలు ఉన్నాయి… ఆయనంటే టీడీపీ నేతలెవరికీ గిట్టడం లేదు … దాంతో వారెవరు ఆయనకు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు…
ఈ నేపథ్యంలో కేశినేని నాని కుమార్తెకు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇవ్వడం ద్వారా నానిని సైలెంట్ చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందంట.. కేశినేని కూడా ఆ ప్రతిపాదనకు సుముఖంగానే ఉన్నట్టు చెప్తున్నారు .. ఆ క్రమంలో లగడపాటిని బెజవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోందంట … ఈ మేరకు టీడీపీ పెద్దలతో లగడపాటి చర్చలు విజయవంతంగా ముగిసినట్టు తెలిసింది… మరి రానున్న రోజుల్లో లగడపాటి మళ్లీ తన మార్క్ రాజకీయాల్ని చూపిస్తారో లేదో?