Latest Posts

పవన్ కళ్యాణ్ ,బాలకృష్ణల భేటీలో ఏం జరిగింది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహం నందమూరి బాలకృష్ణ ,సినీ ఇండస్ట్రీతో పాటు పొలిటికల్‌గా ఎవరి క్రేజ్ వారిదే అలాంటిది వారిద్దరు కలిసి కూర్చున్నారంటే ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు .. అదీ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ హాట్‌హాట్‌గా సాగుతున్న టైంలో బాలయ్యతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ భేటీ అవ్వడం ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది.. దీనిపై అటు రాజకీయ చర్చలు ప్రారంభమైతే… ఇటు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందం పట్టలేక రచ్చరచ్చ చేసేస్తున్నాయి.అసలు ఆ అగ్రహీరోల భేటీలో ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది … టాలీవుడ్‌లో అగ్రహీరోలుగా వెలుగొందుతున్న నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.వీరిద్దరూ సినీ ప్రముఖులే కాకుండా రాజకీయాల్లోనూ కీలక నేతలు కావడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్య, పవన్ నటిస్తున్న రెండు సినిమాల చిత్రీకరణ ఒకే సమయంలో జరుగుతుండటంతో వీరిద్దరి భేటీ జరిగింది.బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తుండగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్నారు…. ఈ క్రమంలోనే వీరసింహారెడ్డి సెట్స్‌కు వెళ్లి బాలయ్యను కలిశారు పవన్ కళ్యాణ్.చిత్ర బృందంతోనూ కలిసి వారితో కాసేపు ముచ్చటించారు.వీరసింహారెడ్డి చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

మరోవైపు, బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్-2కి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ హాజరవుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.ఇందుకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన ఏదీ రానప్పటికీ.వీరి భేటీతో బాలయ్య టాక్ షోలో పవన్ ఖచ్చితంగా కనిపిస్తారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆ ఇద్దరి భేటీ ఫొటోలు వైరల్ కావడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.వీరసింహారెడ్డితో హరిహర వీరమల్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు.వీరిద్దరూ కలిస్తే అన్‌స్టాపబుల్-2 మరో లెవల్లో ఉంటుందంటూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఆ తర్వాత బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ ఏకాంతంగా 20 నిమిషాలు భేటీ కావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా కానివ్వనని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అవసరమైన నిర్ణయం తీసుకుంటానన్నారు… ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తున్న జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.

అటు టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం సుముఖంగా ఉన్నారన్నది బహిరంగ రహస్యమే.ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేతగా ఉన్న బాలకృష్ణతో జనసేనాని 20 నిమిషాలు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో మరోమారు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఏపీ రాజకీయాలపైనా వీరిద్దరూ ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది.ఏదేమైనా ఈ వారిద్దరి భేటీ అభిమానులను మాత్రం తెగ ఖుషీ చేస్తోంది.

Latest Posts

Don't Miss