Latest Posts

నల్లమల అడవిలో దారి దోపిడీ…

నల్లమల అడవిలో దారి దోపిడీ.. కారును వెంబడించి.. నగదు, బంగారం దోచుకెళ్లి.. కాకులు దూరని కారడవి,చీమలు దూరని చిట్టడవి,అలాంటి మార్గంలో నిధితో వెళ్తుంటారు. అలా వెళ్తుండగా దారి మధ్యలో దోపిడీ దొంగలు వచ్చి వారిపై దాడి చేసి నిధి మొత్తాన్ని ఎత్తుకెళ్లిపోతారు. ఇలాంటి సీన్ లు మనం చాలా సినిమాలో చూశాం. కానీ రియల్ లైఫ్ లో నూ ఇలాంటి ఘటనే జరిగింది. అది కూడా నల్లమల అడవుల్లో కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ దారి దోపిడీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సినిమా ఫక్కీలో దుండగులు కారును వెంబడించి నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. నరసారావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు శనివారం రాత్రి నంద్యాల నుంచి నరసారావుపేటకు కారులో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును మరో కారులో వెంబడించిన ఆరుగురు సభ్యులు గల దుండగులు.. గిద్దలూరు మండలం దిగువమెట్ట చెక్‌పోస్టుకు కొంతదూరంలో వ్యాపారుల కారును ఆపారు.కారు అద్దాలను ధ్వంసం చేసి వ్యాపారులపై దాడి చేసి రూ. 45 లక్షలు నగదుతో పాటు 950 గ్రాముల బంగారాన్ని వ్యాపారస్థుల కారుతో ఉడాయించారు. అక్కడి నుంచి కొంతదూరం వెళ్లిన దుండగులు గిద్దలూరు మండలం కె.ఎస్‌ పల్లె వంతెన వద్ద కారును వదిలివెళ్లారు. వెంటనే అప్రమత్తమైన బాధితులు.. నంద్యాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు గిద్దలూరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుండగులు కారును వదిలి అక్కడినుంచి పారిపోయారు. కారును తనిఖీ చేయగా లాకర్‌లో దాచిన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు గిద్దలూరు పోలీసులు తెలిపారు.

Latest Posts

Don't Miss