టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా పర్యటనపై పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అయితే, వైసీపీ ఊహించని స్థాయిలో చంద్రబాబు పర్యటన విజయవంతమైందని తెలిపారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ప్రజల్లో కనిపిస్తోందని, చంద్రబాబు పర్యటన ద్వారా ఆ విషయం స్పష్టమైందని అన్నారు. చంద్రబాబు మూడ్రోజుల పర్యటన సందర్భంగా పోలీసు సిబ్బంది, అధికారులు అందించిన సేవల పట్ల అభినందనలు తెలుపుతున్నామని అశోక్ గజపతిరాజు వెల్లడించారు.