Latest Posts

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో బీజేపీ నేత డీకే అరుణ

డీకే అరుణ.. గద్వాల జేజమ్మగా ఈమె పేరు తెలియని తెలంగాణ వారు ఉండరు. ఆమె పుట్టిల్లు, మెట్టినిల్లు రెండూ రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలే. కేసీఆర్‌ కుటుంబం రూ.లక్షల కోట్లు పోగేసింది.. రాష్ట్ర సర్కారుపై జనంలో వ్యతిరేకత ఉంది.
కాంగ్రెస్‌ బలహీనమైపోయింది.. నాయకత్వం లేదు.. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో బీజేపీ నేత డీకే అరుణ
బీజేపీ గెలిస్తే.. సీఎం జాబితాలో మీరు ఉంటారా?
సీఎం అభ్యర్థి గురించి పార్టీలో ఇప్పటి వరకూ చర్చ జరగలేదు. ముందు పార్టీని అధికారంలోకి తేవాలి కదా. బీజేపీ అధికారంలోకి రావాలని.. తాము ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ అనుకుంటారు. రాజకీయాల్లో ఉన్న ఎవరైనా ఎదగాలని కోరుకుంటారు. మీరు ఏ లక్ష్యం(ముఖ్యమంత్రి) అని అంటున్నారో.. దానికి నాకు కూడా అర్హత ఉందని అనుకుంటున్నా.
డీకే అరుణ.. గద్వాల జేజమ్మగా ఈమె పేరు తెలియని తెలంగాణ వారు ఉండరు. ఆమె పుట్టిల్లు, మెట్టినిల్లు రెండూ రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలే. ఆ ఇళ్లలో మహిళలెవరూ రాజకీయాల్లోకి రాకున్నా.. అరుణ ధైర్యంగా ముందడుగు వేశారు. రెండు దశాబ్దాలు కాంగ్రె్‌సలో ఉన్నారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ తొలి శాసనసభలో చురుగ్గా వ్యవహరించారు. 2018 ఎన్నికల్లో ఓడినా.. కొద్ది నెలలకే బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలైన అరుణ.. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో పలు అంశాలపై మాట్లాడారు.
కాంగ్రెస్‌ నుంచి వచ్చి.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అయిపోయారు. ఎలా..?
నేను కాంగ్రె్‌సలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేదాన్ని. నా నేపథ్యం, కష్టపడే తత్వం చూసి బీజేపీలో గుర్తింపు ఇచ్చారని అనుకుంటున్నా. దాంతో నాకు కూడా కమిట్‌మెంట్‌తో పనిచేయాలనే పట్టుదల వచ్చింది. టీఆర్‌ఎ్‌సను ఓడించాలి, ఆ శక్తి బీజేపీకి మాత్రమే ఉందనే నమ్మకంతోనే బీజేపీలో చేరా.
మిమ్మల్ని టీఆర్‌ఎ్‌సలోకి రమ్మన్నారా..?
తెలంగాణ వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిలిచారు. రానని చెప్పాను.
ఇప్పుడు బీజేపీ, బీఆర్‌ఎస్‌ రోజూ సవాళ్లు విసురుకుంటున్నారు. నిజంగా అంత సీన్‌ ఉందా బీజేపీకి..?
కచ్చితంగా ఉంది. తెలంగాణలో ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించింది. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్‌, మునుగోడు ఎన్నికల్లో ఆ విషయం రుజువైంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మాపై విశ్వాసం కలిగింది. నిజానికి కేసీఆర్‌ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, రైతు రుణమాఫీ అమలు కాలేదు. పల్లెల్లో అసలు ప్రగతి లేదు. కేంద్రం ఇచ్చే నిధులతోనే అంతో కొంతో ఊళ్లలో అభివృద్ధి జరుగుతోంది. ఇక్కడ ఉన్న అభివృద్ధి భారత దేశంలో ఎక్కడా లేదని డబ్బా కొట్టుకుంటున్నారు.
బీఆర్‌ఎస్‌తో బీజేపీకి ప్రమాదమని ఫీలవుతున్నారా?
అస్సల్లేదు. బీఆర్‌ఎస్‌ తెలంగాణలోనే చేసిందేం లేదు.
మీరు మంత్రిగా చేశారు.. అసలు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు సాధ్యమా?
సాధ్యం కాదు. ఎన్నికల ముందు మా దగ్గర రోడ్డు పక్కన స్థలం తీసుకుని కొన్ని ఇళ్లు కట్టారు. వచ్చీపోయేవాళ్లకి కనబడాలని. అవి చూసి జనం ఆశపడి ఓట్లేశారు. వాటిని కట్టి ఐదారు ఏళ్లవుతోంది. ఎవరికీ ఇవ్వలేదు. ఆ ఇళ్లు ఇప్పుడు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయినప్పుడు.. మళ్లీ తానే సీఎం అవుతానన్నది కేసీఆర్‌ ధీమా..?
ఆ ధీమాతోనే ఉన్నారు. బీజేపీకి భయపడి.. కాంగ్రెస్‌ బలహీన పడకుండా చూసుకుంటున్నారు. కానీ ప్రజల్లో అవగాహన వచ్చింది.. కేసీఆర్‌ను ఓడించడం బీజేపీకే సాధ్యమవుతుందని. కాంగ్రెస్‌ బలహీనపడిపోయింది. రాష్ట్ర పార్టీలో రోజూ కీచులాటలు, కొట్లాటలు. ఈ పరిస్థితుల్లో కాంగ్రె్‌సకు ఓటేస్తే కేసీఆర్‌ను గెలిపించిన వాళ్లమవుతామనే ఆలోచన ప్రజల్లో వచ్చింది.
కేసీఆర్‌కు సమ ఉజ్జీ.. బీజేపీలో ఉన్నారా?
కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నాయకుడిలా కనిపిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. వచ్చాక ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది.
బీజేపీలో పాత వారికి, కొత్తగా చేరిన వారికి కొంత ఘర్షణ ఉందంటున్నారు. నిజమేనా..?
సర్దుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. అందరూ కలిసే పనిచేస్తున్నారు. అందరి లక్ష్యం బీజేపీని అధికారంలోకి తేవడమే.
బీజేపీకి క్షేత్రస్థాయిలో అంత బలం లేదు కదా?
తెలంగాణ వచ్చాక జరిగిన ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు అభ్యర్థులే లేరు. బీజేపీ ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించింది కాబట్టి తప్పకుండా మంచి అభ్యర్థులు పార్టీలోకి వస్తారు. చిరకాలం ప్రజలకు సేవ చేయాలనుకునే వారు బీజేపీలో చేరుతారు.
తొలుత మోదీని సమర్థించిన కేసీఆర్‌.. తర్వాత వైఖరి మార్చుకున్నారు. ఎక్కడ తేడా వచ్చింది?
అది కేసీఆరే చెప్పాలి. బీజేపీ తెలంగాణలో ఉండకూడదని ఆయన అనుకున్నట్టున్నారు. జీహెచ్‌ఎంసీ, దుబ్బాకలో గట్టిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం.. తెలంగాణలో బీజేపీ రాజకీయంగా అడుగులు వేయడం ఆయనకు నచ్చినట్టు లేదు.
టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందంటున్నారు?
అలాంటి చర్చ జరగలేదు. అలాంటిది ఉంటుందని నేననుకోను. బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుంది.
దక్షిణ తెలంగాణలో బీజేపీకి బేస్‌ లేదు కదా..?
బేస్‌ లేక కాదు.. గతంలో బీజేపీ కింది స్థాయి వరకు ఎప్పుడూ దృష్టి సారించలేదు. దాని వల్ల కొంత వెలితి ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు నల్లగొండ, ఖమ్మం జిల్లాలో బలమైన నాయకులను మా పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా బీజేపీ బలపడుతుంది. కాంగ్రె్‌సలో ముఖ్య నాయకులు, బీఆర్‌ఎస్‌ను ఓడించాలనుకునే నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు.
మీకు రాజకీయాల్లో విరోధి అయిన జూపల్లి కృష్ణారావును తెచ్చుకుంటున్నారా..? ఏమైనా మాట్లాడారా..?
వస్తే తప్పకుండా తీసుకుంటాం. నేను మాట్లాడలేదు.
ఐటీ, ఈడీ దాడులన్నీ కేసీఆర్‌ను లక్ష్యంగా
చేసుకుని జరుగుతున్నాయంటున్నారు?

అది పచ్చి అబద్ధం. మీడియాలో జరుగుతున్న ప్రచారమిది. నేను కనుక్కున్నాను.. ఇది దుష్ప్రచారమని, అలాంటింది ఉండదని ఆ శాఖ అధికారులు చెప్పారు. ఇక్కడి ప్రభుత్వానికి ఎలాంటి ప్రచారమైనా చేయించగల శక్తి ఉంది. కేంద్రం తమపై కక్ష సాధిస్తోందని చెప్పుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారు. ఎనిమిదిన్నరేళ్లలో సీఎం, ఆయన కుటుంబం రూ.లక్షల కోట్లు సంపాదించారు.
కేంద్రం మీ చేతుల్లోనే ఉన్నా చర్యలు తీసుకోలేదే?
ఎక్కడైనా ఏవైనా ఫిర్యాదులు వచ్చి రాష్ట్రంలో సోదాలు చేస్తుంటే.. కేసీఆర్‌పై దాడి అంటున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటి ఆధారంగా విచారణ చేసినప్పుడే కదా వాస్తవాలు బయటకు తెలిసేది. సమయం వచ్చినప్పుడు కేసీఆర్‌ జైలుకు పోతారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఉన్నారని వార్త వచ్చింది. సంబంధిత ఏజెన్సీలు విచారణ చేశాయి. వాస్తవాలు కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ ఎంతో కొంత ఆత్మరక్షణలో పడలేదా?
ఎమ్మెల్యేల కొనుగోలు పచ్చి అబద్ధం. అది మునుగోడు ఎన్నికలప్పుడు వచ్చింది. ఆ సమయంలో కేసీఆర్‌ ఢిల్లీలో ఉన్నారు. వారం రోజులు అక్కడ కూర్చుని ఈ కథను రచించారు. కేసీఆర్‌ స్వయంగా దీనిని నడిపించారా..? లేదా నిజంగా రోహిత్‌ రెడ్డిని ఎవరైనా సంప్రదిస్తే.. ఆయనను పట్టుకుని ఇదంతా చేశారా..? అన్నది తెలియదు.
మీకు షర్మిలకు ఎందుకు లడాయి వచ్చింది?
జగడం ఎప్పుడూ లేదు. ఇక్కడ తెలంగాణ సెంటిమెంటు ఉంటుంది. ప్రజలు స్వాగతించరని చెప్పాను. ఆ తర్వాత ఆమె ఏదో మాట్లాడింది. నేను దానికి స్పందించలేదు. ఆమెవి తెలిసీ తెలియని రాజకీయాలు. ఆమె మాట్లాడిన ప్రతి దానికీ మనం స్పందిస్తే ఎట్లా..?
షర్మిలను టోయింగ్‌ వాహనంలో తీసుకెళ్లడం, దానిపై మోదీ స్పందించడం అసాధారణం కాదా?
వాళ్లు ఎలా స్పందించారో మీడియాలో చూశాం కానీ.. మాకైతే వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు. అదంతా మీడియాలో వచ్చిందే.
చంద్రబాబు, షర్మిల, పవన్‌.. బీజేపీ ప్రయోగిస్తున్న బాణాలు అని బీఆర్‌ఎస్‌ వాళ్లు అంటున్నారు..?
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి చాలా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైతే బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనతో ఉంది.
బీఆర్‌ఎస్‌ నుంచి చాలా మంది బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట? నిజమేనా?
చాలా మందే ఉన్నారు. మంత్రులు కూడా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వస్తారు.

Latest Posts

Don't Miss