గత నాలుగు నెలల్లో టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ కన్నుమూయగా, తాజాగా నటుడు చలపతి రావు హఠాన్మరణంతో ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. చలపతి రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.
స్వగ్రామం బలిపర్రులో విషాదఛాయలు..
చలపతిరావు మరణంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వగ్రామం బలిపర్రు. చలపతి రావు తరచూ స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి వస్తుండేవారు. గ్రామ అభివృద్దిలో ఆయన భాగస్వామ్యం ఉండేది.
చలపతి రావు సినీ ప్రస్థానం ..
గూఢచారి 116 సినిమతో సినీరంగ ప్రవేశం చేసిన చలపతి రావు ఇప్పటివరకు దాదాపు 1200లకు పైగా చిత్రాల్లో నటించారు.ప్రతి నాయకుడుగా, నటుడుగా ఆయన మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట వంటి సినిమాలకు నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు.మలుపుతిప్పిందనే చెప్పుకోవాలి.
1944 మే8న కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రులో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు (రవి బాబు), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య ఇందుమతి అగ్ని ప్రమాదంలో చనిపోయారు. చెన్నైలో ఉన్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది.
చలపతిరావు కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత బుధవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానం ఫ్రీజర్లో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.