కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు పరితపిస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ప్రత్యేక రోజుల్లో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా సరే వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. ఈ సారి కూడా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల రద్దీ తప్పదని మరోసారి రుజువైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10 రోజులకు సంబంధించిన 2లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా కేవలం 45 నిమిషాల్లో అన్ని టికెట్లు ఖాళీ అయ్యాయి.ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 2న వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.