1979… ఉత్తరప్రదేశ్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్సైతో పోటు పోలీసు సిబ్బంది మొత్తం పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో తలపాగ, దుస్తులంతా బురద కొట్టుకొని వున్న ఒక ముసలిరైతు స్టేషన్ లోనికి వచ్చాడు. అతని వైపు ఎగాదిగా చూసిన సిబ్బంది ఏం కావాలంటూ నిర్లక్ష్యంగా అడిగారు. తన పశువులు కనిపించడం లేదనీ, వాటిని వెతికిపెట్టమనీ అడిగాడా ముసలిరైతు.అతని వంక అసహ్యంగా చూస్తూ..వచ్చేస్తాయిలే పో అని అన్నారు వాళ్ళు. అయినా రిపోర్టు రాసుకోండని రైటర్ ను అడిగాడా రైతు. నిర్లక్ష్యంగా చూస్తూ తెల్లకాగితం అతని వైపు తోచాడు రైటర్. మళ్ళీ ఓహో నీకు రాయడం రాదుకదా! అంటూ హేళనగా మాట్లాడుతూ ఏదో రిపోర్టు రాసి, ఈక్రింద వేలిముద్రవేయమని స్టాంప్ పాడ్ ఇచ్చాడు రైతుకు. అందుకు రైతు నేను సంతకం చేయగలను.పెన్ ఇవ్వండి అన్నాడు. అది విని రైటర్ బిగ్గరగా నవ్వుతూ “నువ్వు పెన్ ఎప్పుడైనా చూసావా? ఇదిగో సంతకంపెట్టు అన్నాడు. పెన్ తీసుకొని రైటర్ చెప్పిన చోట సంతకంచేసి ఇచ్చాడు రైతు. ఆ సంతకం చూసిన ఆ రైటర్ దిగ్గునలేచి ఆ ముసలి రైతుకు సల్యూట్ కొట్టాడు. అది చూసిన మిగతావారు కంగారుగా వచ్చి సంతకం ను పరిశీలించి సల్యూట్ చేసి వినయంగా నిలబడ్డారు. ఇంతకీ ఆ సంతకం లో ఏమివుందో తెలుసా?? “చౌదరీ చరణ్ సింగ్ .పియం ఆఫ్ ఇండియా” అని. పోలీసుల నిర్లక్ష్యానికి ప్రతిగా పోలీసుస్టేషన్ లోని సిబ్బందినంతా సస్పెండ్ చేశారు చరణ్ సింగ్ గారు. అలా చేసిన మొదటి ప్రధాని ఆయనే!!!ఆయన పోరాటం వల్లే జమీందారీ వ్యవస్థ రద్దు అయింది, రైతులకు సబ్సడీ రుణాలు వచ్చాయి.. కౌలు రైతు చట్టం వచ్చింది.
చౌదరి చరణ్_సింగ్ గారు (1902 డిసెంబరు 23 – 1987 మే 29) భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించారు. చరిత్రకారులు, ప్రజలు తరచూ అతనిని ‘భారతదేశపు రైతుల విజేత’ గా గుర్తించారు.చరణ్ సింగ్ సోవియట్-శైలి ఆర్థిక సంస్కరణల పై జవహర్ లాల్ నెహ్రూను వ్యతిరేకించారు. అతను 1947 తరువాత ఉత్తర భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి సహాయం చేశారు. భారతదేశంలో సహకార సేద్యం విజయవంతం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక రైతు కుమారునిగా, ఒక రైతుకు సరైన యాజమాన్య హక్కు అతను వ్యవసాయదారునిగా ఉండడమేనని అభిప్రాయపడ్డారు. అతను రైతు యాజమాన్య వ్యవస్థను సంరక్షించి స్థిరీకరించాలని కోరుకున్నారు. నెహ్రూ ఆర్థిక విధానం గురించి బహిరంగ విమర్శలు చేసిన కారణంగా చరణ్ సింగ్ రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారింది. రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అతని జన్మదినం డిసెంబరు 23 న కిసాన్ దివస్ (జాతీయ రైతు దినోత్సవం) గా జరుపుకుంటారు.