Latest Posts

ఏపీతో బాబుకి ఏమిటి సంబంధం…? మంత్రి ధర్మాన సూటి ప్రశ్న

  • 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరాంధ్రకి బాబు ఏం చేశాడు?
  • బీసీలకు చంద్రబాబు ఏ ఒక్క మేలు చేయలేదు, ఒక రాజ్యసభ సీటు ఇవ్వలేదు.
  • జిల్లా విస్తృత స్థాయి స‌మావేశంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్రసాద రావు.

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ల కాలగ‌తిలో ఎన్న‌డూ లేని విధంగా జగన్ గారి గొప్ప పరిపాల‌న స్థానిక అంబేద్క‌ర్ ఆడిటోరియంలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రీ‌కాకుళం జిల్లా విస్తృత స్థాయి స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..”గురువారంవిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. రాజాంతో స‌హా ప‌లు ప్రాంతాల్లో రోడ్ షో చేస్తూ కొన్ని బాధ్య‌త లేని వ్యాఖ్య‌లు చేసి వెళ్లిపోయారు. ఆయ‌న ఎప్పుడు వ‌చ్చినా ఇదే విధంగా బాధ్య‌త అంటూ లేకుండా వ్యాఖ్య‌లు చేసి వెళ్లిపోవ‌డం చూస్తున్నాం. రాష్ట్రమంతా అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అనే విధానానికి సిద్ధం అయితే చంద్ర‌బాబు మాత్రం అందుకు విరుద్ధంగా ఆయ‌న అమ‌రావ‌తే రాజ‌ధాని అని, దానికి అంతా ఒప్పుకున్నారు అన్న అర్థం వ‌చ్చే విధంగా మాట్లాడుతున్నారు.ఇక్క‌డికి వ‌చ్చి కూడా విశాఖ రాజ‌ధాని గురించి మాట్లాడ‌రు. రాజాం వ‌చ్చి కూడా ఆంధ్రుల‌కు ఒకే రాజ‌ధాని అని అంటారాయ‌న‌. కానీ ఒకే రాజ‌ధాని వ‌ల‌న వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏంటి అని ప్ర‌శ్నిస్తే మాత్రం ఆయ‌న స‌మాధానం చెప్ప‌రు. ఇప్ప‌టికీ ఆయన ద‌గ్గ‌ర ఇందుకు త‌గ్గ స‌మాధానం లేదు. అమ‌రావ‌తే రాజ‌ధాని అని చెప్ప‌డం వెనుక ప్రయోజనం ఏంటంటే ఆయ‌న ప్ర‌యోజ‌నాలు అన్న‌వి ముడిప‌డి ఉన్నాయి. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఆయ‌న‌కు అనుకూలంగా ఆ రోజు రాజ‌ధాని అమ‌రావ‌తి అంటూ తెగ హ‌డావుడి చేశారు. ఇదే విధంగా గతంలో హైద్రాబాద్ లో అభివృద్ధి పేరిట రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ఒక‌టి చేశారు.

ఈ ప్రాంతానికి ఓ క్యాపిట‌ల్ వ‌స్తుందంటే మీరు క‌నీసం ఒక్క మాట మాత్రంగా అయినా ఏమీ చెప్ప‌లేక‌పోతున్నారు..మేం ఈ విష‌యమై ఉద్య‌మిస్తున్నా స‌రే మీరు క‌నీసం స్పందించ‌డం లేదు. అలాంట‌ప్పుడు మీరు ఎలా ఈ ప్రాంతం ఓట్లు పొంద‌గ‌ల‌ర‌ని ?ఏ విధంగా మీరు ఈ ప్రాంత ప్ర‌జ‌ల అభిమానాన్ని పొంద‌గ‌ల‌ర‌ని ? అబ‌ద్ధాలు మాట్లాడి వెళ్లిపోవ‌చ్చు అని అనుకుంటున్నారా ?

ఏ విధంగా అనుకుంటారు మీరు.. మీరు ఇష్టం వ‌చ్చిన విధంగా మాట్లాడి వెళ్లిపోతే మీకు అనుగుణంగా ప‌త్రిక‌లు ఉన్నాయి క‌నుక అవ‌న్నీ ఆ మాట‌ల‌ను అచ్చు వేస్తాయి క‌నుక బాధ్య‌తా రాహిత్య రీతిలో వ్యాఖ్య‌లు చేశారా ? లేదా ఏ ప్ర‌యోజ‌నం ఆశించి మీరు ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు ? తోట‌ప‌ల్లి ప్రాజెక్టు నేనే చేశాను అని అంటారు. మీరేనా ఆ ప్రాజెక్టు ప‌నుల‌ను చేప‌ట్టింది. చెప్పండి. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో సంబంధిత ప‌నులు చేప‌ట్టాం. మీ హ‌యాం వ‌చ్చిన స‌మ‌యానికి మిగిలిన ప‌ది శాతం ప‌నులు చేప‌ట్టారు దానికే ప్రాజెక్టు ప‌నులు మొత్తం మేమే చేశాం అన‌డం, ఆ విధంగా వ్యాఖ్య‌లు అసంబద్ధ రీతిలో చేయ‌డం విచార‌క‌రం. వాస్త‌వ దూరం. వంశ‌ధార ఫేజ్ 2 కూడా నేనే చేప‌ట్టాన‌ని అంటారు.

మాట్లాడితే చాలు బీసీల‌ను నేనే ఉద్ధ‌రించాన‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ఇంత‌కూ మీ ప‌రిధిలో ఆ రోజు బీసీ నాయ‌కులకు ద‌క్కిన రాజ‌కీయ ప్రాధాన్యం ఎంత ? మీరేమ‌యినా రాజ్య స‌భ మెంబ‌ర్ ను ఒక్క బీసీ నాయ‌కుడినైనా చేశారా ? విభ‌జ‌న అనంత‌రం నలుగురు బీసీల‌కు రాజ్య స‌భ స‌భ్యులుగా ప‌ద‌వీ యోగం క‌ల్పించాం. ఏ రోజ‌యినా ఓ వెనుక‌బ‌డిన త‌ర‌గతుల‌కు చెందిన జ‌డ్జి పేరును మీరు రిక‌మెండ్ చేశారా ? రిక‌మెండ్ చేయ‌లేదు స‌రి క‌దా వీరంతా ప‌నికి రారు అన్న భావం క‌లిగిన నేత మీరు.. చ‌ప్ప‌ట్లు కొడుతున్నారు క‌నుక అబ‌ద్ధాలు చెప్పి వెళ్లిపోతున్నారు మీరు. మీకు రాయ‌డానికి కొన్ని ప‌త్రిక‌లు ఉన్నాయి క‌నుక మీరు ఏవో నాలుగు మాట‌లు అస‌మంజ‌స రీతిలో మాట్లాడి వెళ్లిపోతున్నారు.

శ్రీ‌కాకుళం ప‌ట్ల కానీ లేదా ఈ ప్రాంతం పట్ల కానీ మీకు ఏనాడూ మంచి అభిప్రాయం లేదు. ఇదంతా వ్యాపారాత్మ‌క దృక్ప‌థం. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ స‌మాజంలో నెల‌కొన్న అస‌మాన‌త‌ల‌ను కూక‌టి వేళ్ల‌తో పెకిళించేందుకు ఓ గొప్ప ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా సంస్క‌ర‌ణ‌లు అమలు చేస్తున్నారు. అవి అంద‌రికీ అర్థం కావు.

ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థులకు ట్యాబ్స్ పంచాం. అంటే ఆ కుర్రాడు మ‌న‌కు ఓటేస్తాడా ? ఎందుకు ఇచ్చారు ఓ ధ‌నవంతుడితో స‌మానంగా ఓ పేద‌వాడు కూడా చ‌దువుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ప‌ద్ధ‌తిని అమ‌లు చేస్తున్నారు. బీద‌రికం అన్న‌ది త‌న ఎదుగుద‌ల‌కు అడ్డంకి కాకుండా ఉండాల‌న్న‌ది ఓ ల‌క్ష్యం. ఇది ఎంత మందికి అర్థం అవుతుంది. దీనిని మ‌నం అంద‌రికీ అర్థం అయ్యేలా చెప్పాలి. ఈ స‌మాజంలో నెల‌కొన్న అస‌మానత‌లు తొల‌గిపోయేందుకు మార్గం ఏంటి ? విద్య ఒక్క‌టే ..ఈ అస‌మాన‌త‌లు త‌గ్గించ‌గ‌లిగేది ఒక్క విద్యే .. ఒక కుటుంబంలో ఒక విద్యార్థి ఈ ప్ర‌భుత్వ సాయంతో సామాజిక ఉన్న‌తి పొంద‌గ‌లిగితే ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌గ‌లిగితే అత‌డే ఆ స‌మూహాన్నీ లేదా ఈ స‌మాజాన్ని ముందుకు తీసుకువెళ్ల‌గ‌ల‌డు అన్న దృక్ప‌థంతో జ‌గ‌న్ ప‌నిచేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఆధునిక సాంకేతిక‌త‌ను పేద విద్యార్థుల‌కు చేరువ చేసేందుకు పెద్ద పెద్ద కంపెనీల‌తో స‌మన్వ‌యం అయి వారికి నాణ్య‌మ‌యిన విద్యా విధానం అందేవిధంగా, ధ‌న‌వంతుల బిడ్డ‌ల‌కు మాదిరిగానే ఉన్న‌త స్థాయి ప్ర‌మాణాల‌తో కూడిన పాఠాలు అందే విధంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఒక విద్యార్థి పొందే ఉన్న‌తి కార‌ణంగా సామాజిక ఆర్థిక అస‌మాన‌త‌లు అన్న‌వి తొల‌గిపోతాయి. అందుకే ఆయ‌న అంత శ్ర‌ద్ధ వ‌హించి విద్య‌కు ప్రథ‌మ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. అటువంటి వ్య‌క్తి మీకు పిచ్చోడిలా క‌నిపిస్తున్నారా ? మీరు ఆయ‌న్ను పిచ్చోడు అని అనేస్తా అయిపోతుందా ? ఇదంతా మ‌న‌ల్ని అవ‌మానించ‌డం అన్న‌ది విప‌క్ష నేత ఉద్దేశంలా ఉంది. బ‌ల‌హీన వ‌ర్గాల పిల్ల‌ల‌కు ఉన్న‌త రీతిలో ఉత్త‌మ నాణ్య‌త‌తో కూడిన విద్య అందుతుంటే చూసి ఓర్వ‌లేని త‌నంతో వ్యాఖ్య‌లు చేయ‌డం అన్న‌ది నిజంగా అవ‌మానించ‌డ‌మే !

విశాఖ‌లో భూములు ఎవ‌రివి ? మాకున్నాయా మీకున్నాయా ? టీడీపీ అధినేత మాట్లాడేట‌ప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి. వివేకానికి ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడాలి. క‌బుర్లు చెప్పి వెళ్లిపోతాం అనుకుంటే వినే ప‌రిస్థితుల్లో ఇక్క‌డెవ్వ‌రూ లేరు. ఇటువంటి మాయ మాట‌ల‌తో మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. మీరు (తెలుగుదేశం పార్టీ అధినేత‌) ఈ ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి చేసిందేంటో చెప్ప‌గ‌ల‌రా ? పోనీ బీసీల‌కు మీరు చేసిందేంటో చెప్ప‌గ‌ల‌రా ? 14 ఏళ్లుగా ముఖ్య‌మంత్రిగా ఉంటూ బ‌ల‌హీన వ‌ర్గాల‌కు, బ‌డుగు వ‌ర్గాల‌కు అన్యాయం చేశారు మీరు. అన్యాయం కాదు మీ మ‌న‌సులో కూడా వారి ఉన్న‌తి కోసం ఏ కోశాన అనుకున్న దాఖ‌లాలు లేవు అని చెప్ప‌గ‌ల‌ను.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓ కులాన్ని త‌క్కువ‌గా ఎప్పుడూ చూడ‌రు. పొర‌పాటున కూడా చూడ‌రు. ఓ కులాన్ని త‌క్కువ‌గా చూడ‌డం అన్న‌ది ఆ ఇంటావంటా ఉండ‌దు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కి లేదు. రాజశేఖ‌ర్ రెడ్డికి లేదు. వివిధ కులాల‌ను వేర్వేరు సంద‌ర్భాలలో ఉద్దేశిస్తూ మీరు ఏమ‌న్నారో అంద‌రికీ తెలుసు. కులాల‌ను ఉద్దేశించి అటువంటి వ్యాఖ్య‌లు ఏనాడూ మా అధినేత చేయ‌రు. వ్య‌క్తుల‌ను ఇష్ట‌ప‌డితే ప‌డ‌తారు లేకుంటే లేదు. అంతే కానీ ఓ కులాన్ని ఉద్దేశించి కించ ప‌రిచే వ్యాఖ్య‌లు మా అధినేత చేయ‌రు.

ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు ఉందా ?
మీరేమో హైద్రాబాద్ లో ఉంటారు. ఏంటి ఈ రాష్ట్రంతో మీకు సంబంధం. మంత్రి గా కాదు పౌరుడిగానే అడుగుతున్నాను.ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్ కు సంబంధించి మీకేమ‌యినా అనుబంధం ఉందా ? ఈ రాష్ట్రాన్ని కేవ‌లం ఓ వ్యాపార కేంద్రంగా చూస్తున్నారు మీరు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి అమ‌రావ‌తి కేంద్రంగా వ్యాపారం చేయాల‌నుకుంటున్నారు. మీరు ముఖ్య‌మంత్రిగా ఉన్న ఐదేళ్లూ ఇక్క‌డ సొంతంగా ఓ ఇల్లు అంటూ క‌ట్ట‌లేదు. ఇప్ప‌టికీ అలానే ప‌క్క రాష్ట్రంలోనే అన్ని ఆస్తులూ ఉంచుకుని మాట్లాడుతున్నారు.

ఉద్దానం ప్రాంత వాసుల కోరిక గ‌డిచిన 75 ఏళ్లుగా నెర‌వేర‌డం లేదు. ఇన్నాళ్ల‌కు వారి గోడు తీర్చే అవ‌కాశం ద‌క్కింది. దీంతో కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డతాయి. అదేవిధంగా ప‌లాస‌లో కిడ్నీ బాధితుల కోస‌మే ఓ మ‌ల్టీ స్పెషాల్టీ ఆస్ప‌త్రి నిర్మాణం చేప‌డుతున్నాం. ఒక‌నాడు ప్ర‌తిరోజూ పేప‌ర్ లో ఉద్దానం తీరం చెంత కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల బాధల‌పై వార్త‌లు వ‌చ్చేవి.ఈ రోజు ఆ విధంగా వ‌స్తున్నాయా ?

అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో ఉన్న పాఠ‌శాల‌లు చూడండి. నాడు – నేడు ప్రణాళిక అమ‌లుతో వాటి రూపు రేఖ‌లే మారిపోయాయి. వీటన్నింటిపై మాట్లాడాలి. ఒక్క విష‌యం మ‌నం జీర్ణించుకోలేనిది ఏమిటంటే ఒక ప‌ద్ధ‌తి నుంచి మ‌రో ప‌ద్ధ‌తికి మ‌నం ట్రాన్స్ ఫార్మ్ కావాలి. ఈ ప‌ద్ధ‌తిలో కూడా పార్టీ నాయ‌కులంద‌రికీ గౌర‌వం ఉంది. ఆ గౌర‌వాన్ని మ‌నం అందిపుచ్చుకోవాలి. ఇన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలు మ‌న ప్రాంతంలో జ‌రిగి ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగు అవుతున్నాయంటే అది ఒక్క రాజ‌కీయ పార్టీ వల్ల‌నే జ‌రిగింది. దానిని మ‌నం అడాప్ట్ చేసుకోకుండా, ఇందులో నాకు గౌర‌వం లేదు సంతోషం లేదు అని అనేందుకు వీల్లేదు. పూర్వ రీతుల‌కు భిన్నంగా ఇప్పుడు పాల‌న సాగింది. పాత ప‌ద్ధతులు అన్నీ పోయి కొత్త ప‌ద్ధ‌తిలో ఓ స్వేచ్ఛ వ‌చ్చింది. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు స్వేచ్ఛ వ‌చ్చింది.

దొంగ పార్టీ దొంగ మాట‌ల పార్టీ టీడీపీ. ఒక్క మాట కూడా నిజం చెప్పిన వారు ఉండ‌రు అందులో ! అంతా ఓ సెట్టింగ్ లో ఉంటారు. ఈ మ‌ధ్య ఈనాడు పేప‌ర్ లో తాగుడు గురించి తెగ బాధ‌ప‌డిపోతున్నారు. ఎవ‌రు తెచ్చారు ఈ తాగుడును. ఆ రోజు ఎన్టీఆర్ మ‌ద్య పాన నిషేధాన్ని తెస్తే, త‌రువాత మీరే దానిని రద్దు చేశారు. రామోజీ రావు, చంద్ర‌బాబు క‌లిసే తాగుడును మ‌ళ్లీ తీసుకు వ‌చ్చారు. ఇంత‌టి దౌర్భాగ్యం,దుర్మార్గం టీడీపీలో ఉంది. వీటిని నిలువరిస్తూ మ‌న చుట్టూ ఉన్న వారందరినీ ఎడ్యుకేట్ చేస్తే త‌ప్ప మ‌నం ప్ర‌మాదం బారిన ప‌డ‌కుండా ఉండ‌లేం. లేదంటే మ‌ళ్లీ ఊళ్లో ఒక దొంగల ముఠా రాజ్య‌మేలడం ఖాయం. వారే ప‌థ‌కాల‌కు సంబంధించి అర్హుల‌ను ఎంపిక చేయ‌డం, వారి క‌నుస‌న్న‌ల్లోనే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కానీ వివిధ అభివృద్ధి ప‌నులు కానీ జ‌ర‌గ‌డం అన్న‌వి పున‌రావృతం అవుతాయి. మళ్లీ చంద్ర‌బాబుతో స‌హా ఆయ‌న వ‌ర్గాలు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవ‌డం ఖాయం. క‌నుక మీరంతా మాన‌సికంగా సంసిద్ధులు కావాలి అని మ‌న‌వి చేస్తూ ఉన్నాను. టీడీపీ నాయ‌కుల అస‌త్య ప్ర‌చారాల‌ను నిలువ‌రించే క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ ఇప్పుడు నేను చెప్పిన అన్ని మాట‌ల‌పై అవ‌గాహ‌న పెంపొందించుకుని, పూర్తి స‌మాచారంతో మీ చుట్టూ ఉన్న వారిని ఎడ్యుకేట్ చేయాల‌ని విన్న‌విస్తూ ఉన్నాను అని మంత్రి ధర్మాన అన్నారు.

Latest Posts

Don't Miss