నోట్ల రద్దును సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రిజర్వ్ చేసిన తీర్పును కొత్త ఏడాదిలో జనవరి 2న వెల్లడించనున్నది.2016 నవంబర్లో పాత రూ.500, రూ.1,000 నోట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది.ఈ నేపథ్యంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 50కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై కొన్నేళ్లుగా విచారణ జరిపింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది పీ చిదంబరం పిటిషనర్ల తరుఫున వాదనలు వినిపించారు.ఇది అత్యంత దారుణమైన నిర్ణయమని ఆరోపించారు.ఈ ప్రక్రియ దేశ చట్టాలను,పాలనను అపహాస్యం చేసిందని విమర్శించారు.సెంట్రల్ బోర్డు సిఫారసుపై మాత్రమే డీమోనిటైజేషన్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు.అయితే నోట్ల రద్దు సందర్భంగా ఈ ప్రక్రియను కేంద్రం మార్చేసిందని చిదంబరం వాదించారు.
మరోవైపు పెద్ద నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది.ఆర్థిక వ్యవస్థలో పెద్ద ప్రయోజనాల కోసం ఈ ప్రక్రియను చేపట్టినట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు.దీని కోసం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు సాటిలేనివని అన్నారు.అయితే నోట్ల రద్దు విధానం విఫలమైందని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. నల్ల ధనాన్ని,దొంగ నోట్ల చెలామణిని ఇది చాలా వరకు అరికట్టిందని కోర్టుకు తెలిపారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అబ్దుల్ నజీర్,బీఆర్ గవాయ్, ఏఎస్ బొపన్న,వీ.రామ సుబ్రమణియన్,బీవీ నాగరత్నలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అన్ని వర్గాల వాదనలు విన్నది.2016లో తీసుకున్న నోట్ల రద్దు విధానానికి సంబంధించిన అన్ని పత్రాలు,రికార్డులను సమర్పించాలని కేంద్రాన్ని, ఆర్బీఐని ఆదేశించింది.ఈ నెల 7న రిజర్వ్ చేసిన తీర్పును జస్టిస్ నజీర్ పదవీ విరమణకు ఒక రోజు ముందైన జనవరి 2న వెల్లడించనున్నది.