Latest Posts

చంద్రబాబువి మాయమాటలు…ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

  • అధికారంలో ఉండగా సంక్షేమాన్ని పట్టించుకోని బాబు
  • మళ్లీ అధికారంలోకి వస్తే ఇస్తామనడం విడ్డూరం
  • పింఛన్ల విషయంలో ఎవరికీ అన్యాయం జరగదు
  • జనవరి నుంచి రూ.2750 పింఛన్‌ పెంపు
  • ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు
  • ప్రజల్లో విషబీజాలు నాటుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ
  • గతం కంటే వైసీపీకి ప్రజల్లో పెరిగిన ఆదరణ
  • ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ

అధికారంలో ఉండగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు.. మళ్లీ అధికారం ఇస్తే పథకాలు కొనసాగిస్తానని, ఆదాయం పెంచుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. చంద్రబాబు చెబుతున్న మాయమాటలను ప్రజలు నమ్మొద్దని కోరారు. శుక్రవారం నగరంలోని 43వ డివిజన్‌లో కార్పొరేటర్‌ ఇసాక్‌తో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం అనేది గొప్ప కార్యక్రమం అని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమస్యలు గుర్తించి పరిష్కరించడమే కాకుండా పథకాలు అందుతున్న తీరు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రోజురోజుకూ సీఎం జగన్‌కు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్నారు. గత ఎన్నికల కంటే ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెరిగిందన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంటారన్న ఆలోచనతో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రజల మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు చేస్తున్నాయని మండిపడ్డారు. పింఛన్ల విషయంలో ఆ పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. విచారణ అనేది సాధారణంగా జరిగేదే అని, అంత మాత్రాన పింఛన్లు తొలగిస్తామన్నది వాస్తవం కాదన్నారు. అర్హులెవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. జనవరి నుంచి పింఛన్‌ మొత్తాన్ని రూ.2750 చేస్తున్నామని, పింఛన్ల సంఖ్య కూడా ఇప్పటికంటే పెరుగుతాయని అన్నారు. రేషన్‌కార్డులు, హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతిపక్షాలు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏనాడూ ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఈరోజు అధికారం కోల్పోయాక రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాను..సంక్షేమాన్ని కొనసాగిస్తాను అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రజలు వీటిని నమ్మొద్దని, జగన్‌ సీఎంగా ఉన్నంత వరకు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ తమ ప్రభుత్వంలో అన్యాయం జరగదని తేల్చిచెప్పారు. అంతకు ముందు ఉదయాన్నే డివిజన్‌ పరిధిలో షటిల్‌ ఆడుతున్న వారిని పలుకరించిన ఎమ్మెల్యే అనంత.. వారితో కలిసి కాసేపు షటిల్‌ ఆడారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలతో ముచ్చటించారు

చంద్రబాబువి మాయమాటలు...ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

Latest Posts

Don't Miss