Latest Posts

ఆలయాల్లో వ్యాపార దృక్పధం వద్దు – స్వాత్మానందేంద్ర స్వామి


-ప్రొద్దుటూరులో అర్చకులకు శిక్షణ తరగతులు
-కడపకు చేరిన స్వధర్మ వాహిని ప్రచార యాత్ర

దేవాలయాల్లో ఉండాల్సింది వ్యాపార ధోరణులు కాదని, ఆధ్యాత్మిక ధోరణులు ఉండాలని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి అన్నారు. ఆలయ వ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుందని తెలిపారు. భగవంతుడి ఉనికిని చాటిచెప్పే అర్చకులు ధర్మ పరిరక్షకులుగా ఖ్యాతిని పొందాలని హితవు చెప్పారు. స్వధర్మ వాహిని ప్రచార యాత్రలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న స్వాత్మానందేంద్ర స్వామి ప్రొద్దుటూరులో నిర్వహించిన అర్చకుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగస్త్యేశ్వర స్వామి ఆలయంలో అర్చక అకాడమీ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులనుద్దేశించి స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ అర్చకులు పరంపరానుగతంగా అర్చకత్వాన్ని స్వీకరిస్తూ ధర్మాన్ని నిలబెడుతున్నారని ప్రశంసించారు. తమ పిల్లల్ని వేదాలు, ఆగమాలు, శాస్త్రాలపై అధ్యయనం చేసేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అర్చక అకాడమీ ఆధ్వర్యంలో ఇటువంటి శిక్షణ తరగతులు తరచూ నిర్వహించాలని సూచించారు. మంత్రోచ్ఛారణలోను, స్వరంలోను దోషాలు లేకుండా అర్చకులను తీర్చిదిద్దాలని, భగవంతుడిని సుస్వరాలతో ఆరాధించడం ఎంతో ముఖ్యమని సూచించారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణాప్రతాప్‌, అర్చక అకాడమీ డైరెక్టర్‌ వేదాంతం రాజగోపాల చక్రవర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కడపలో యాత్రకు అపూర్వ స్వాగతం
స్వధర్మ వాహిని ప్రచార యాత్ర ప్రొద్దుటూరు నుంచి బయలుదేరి కడప నగరానికి చేరుకుంది. విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు కాజీపేట వద్ద యాత్రకు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఎదురెళ్ళి స్వాత్మానందేంద్ర స్వామిని ఆహ్వానించారు. అనంతరం కడప వీధుల్లో శోభా యాత్ర నిర్వహించారు. పూలను కురిపిస్తూ అడుగడుగునా బ్రహ్మరధం పట్టారు. అప్సర సర్కిల్‌ నుంచి బయలుదేరిన యాత్ర పీఎఫ్‌ ఆఫీసు మీదుగా శిల్పారామం వరకు సాగింది. కాషాయ వర్ణ పతాకాలను చేతపట్టిన భక్తులు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss