Kajal Agarwal: కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. వీడియో వైరల్

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీలు.. రీ ఎంట్రీలు సర్వసాధారణమే. మేల్ యాక్టర్స్ కన్నా నటీమణులు సినిమాలకు ఎక్కువగా దూరం అవుతుంటారు. ఒక్కసారి వివాహబంధంలోకి అడుగుపెట్టాక చిత్ర పరిశ్రమ వైపు చూసే హీరోయిన్లు చాలా తక్కువే. కానీ ఇటీవల కాలంలో పెళ్లైన కూడా సినిమాల్లో హీరోయిన్ గా తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. చందమామ లాంటి అందం, కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీఫుల్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ క్రేజీ మూవీ ఇండియన్ 2 సినిమా కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

కలువ కళ్ల భామ బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్ ని చూస్తుంటే త్వరలో తన అందంతో మళ్లీ అభిమానులను, ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈ చక్కని అందం సినిమాల్లో కి రీ ఎంట్రీ ఇవ్వనుంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఉలగ నాయగన్ కమల్ హాసన్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2 (భారతీయుడు 2).

ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అనేక అవాంతరాలను దాటుకోని మళ్లీ తిరిగి షూటింగ్ జరుపుకుంటుంది ఇండియన్ 2 చిత్రం. అయితే ఎన్నో సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల గుర్రపు స్వారీ నేర్చుకున్న బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్.. తాజాగా కేరళ మార్షల్ ఆర్ట్స్ కలరిపాయట్టు ప్రాక్టీస్ చేస్తోంది. అంతేకాకుండా జిమ్ లో కసరత్తులు కూడా మొదలుపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది కాజల్ అగర్వాల్.

ఈ వీడియో పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్ ”కళరిపయట్టు ఒక పురాతన మార్షల్ ఆర్ట్స్. షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో క్రీడలు కలరిపాయట్టు నుంచే పుట్టుకొచ్చినవే. ఈ యుద్ధ క్రీడ సాధారణంగా గెరిల్లా యుద్ధంలో వినియోగిస్తారు. ఇది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. మూడేళ్లుగా అడపదడపా నేర్చుకుంటున్నా. నాకు చాలా ఓపికగా నేర్పిస్తున్న మాస్టర్ కు ధన్యవాదాలు” అని రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఇండియన్ 2 చిత్రంలో మరో ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సిద్ధార్థ్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్ లో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మరణించడంతో ఈ మూవీ షూటింగ్ ను నిలిపివేశారు. అలాగే సినిమాకు పలు అవాంతరాలు సైతం ఏర్పడ్డాయి.

A post shared by Kajal A Kitchlu (kajalaggarwalofficial)

తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్ లో పదేళ్లకు పైగా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది చందమామ కాజల్ అగర్వాల్. బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ కొద్ది నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక బాబుకు జన్మనిచ్చిన తర్వాత పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించింది ఈ భామ. ఇప్పుడు తన సినీ కెరీర్ పై ఫోకస్ పెడుతూ అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.