సోనియా తలచినది ఒకటైతే..నిర్ణయాలన్నీ బూమరాంగ్.. !!

జైపూర్: రాజస్థాన్‌లో ఆపరేషన్ డెజర్ట్ అధికార కాంగ్రెస్ పార్టీలో పెను సంక్షోభానికి కారణమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో పార్టీ శాసన సభ్యులందరూ తిరుగుబాటు లేవదీశారు. మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధపడ్డారు. రాత్రికి రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్ హైకమాండ్‌కు మింగుడు పడట్లేదు. ఈ సంక్షోభాన్ని నివారించడానికి తక్షణ చర్యలకు దిగింది.

సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై ఎఫ్ఐఆర్ - సీఎంపైనా కేసు: తెలిసి తెలిసీ..అక్కడ ఎంజాయ్సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై ఎఫ్ఐఆర్ – సీఎంపైనా కేసు: తెలిసి తెలిసీ..అక్కడ ఎంజాయ్

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినాయకుడిగా అశోక్ గెహ్లాట్ నియమితులవుతారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం నిర్వహించాల్సిన ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడింది. రేపో మాపో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఉండటం వల్ల అశోక్ గెహ్లాట్ గనక ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైతే- ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన స్థానంలో సచిన్ పైలెట్‌ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నాయి.

సచిన్ పైలెట్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందంటూ వస్తోన్న వార్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటుకు దారి తీసింది. అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి అందజేశారు. ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ మాత్రమే కొనసాగాల్సి ఉంటుందని లేదా సచిన్ పైలెట్‌కు బదులుగా మరొకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలనేది వారి డిమాండ్.

2020లో పార్టీలో, ప్రభుత్వంలో అనిశ్చిత పరిస్థితులకు కారణమైన సచిన్ పైలెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిగా అంగీకరించబోమని అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు. సచిన్ పైలెట్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు ఉన్నందునే అందుకు నిరసనగానే తాము శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశామని స్పష్టం చేస్తోన్నారు. గెహ్లాట్ వర్గానికి చెందిన ఏ ఎమ్మెల్యేనైనా తాము సీఎంగా అంగీకరిస్తామని, సచిన్ పైలెట్ నాయకత్వం తమకు వద్దని చెబుతున్నారు.

సజావుగా సాగిపోతోన్న రాజస్థాన్‌లో పార్టీలో ఈ స్థాయిలో కుదుపు ఏర్పడటానికి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమనే అభిప్రాయాలు లేకపోలేదు. అశోక్ గెహ్లాట్ చేతికి ఏఐసీసీ బాధ్యతలను అప్పగించడానికి ఆమె ముందు నుంచీ ఆసక్తిగానే ఉన్నారు. సీనియర్ కావడం, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు కావడం వల్ల కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆమె ఆశించారు. పోటీలో ఉన్న శశిథరూర్‌ కంటే గెహ్లాట్ వైపే సోనియా మొగ్గు చూపారు.

అశోక్ గెహ్లాట్ తప్పుకొన్న తరువాత రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్‌ను ఎంపిక చేయాలనేది ఆమె అభిప్రాయం. యువనేతను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా అటు ప్రభుత్వం, ఇటు పార్టీ మరింత బలోపేతమౌతుందని భావించారు. దీనికి అనుగుణంగా పావులు కదిపారు గానీ.. అవి బూమరాంగ్ అయ్యాయి. తన వ్యూహాలు తనకే తిప్పి కొట్టాయి. తన చేతుల్లో ఏమీ లేదంటూ- చివరికి అశోక్ గెహ్లాట్ కూడా హ్యాండ్సప్ కావడం దీనికి కొసమెరుపు. ఇక ఆమె ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతోంది.