సీఎం జ‌గ‌న్‌కు అండ‌గా చిరంజీవి, నాగార్జున‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి అగ్ర క‌థానాయ‌కులుగా చెలామ‌ణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున గ‌ట్టి మ‌ద్ద‌తుదారులుగా నిలబడుతున్నారు. ఏపీలో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ నుంచి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు క‌ర‌వైంది. వీరిలో ఎక్కువమంది టీడీపీ మద్ద‌తుదారులుగా ఉన్నారు. అయితే సీఎం జ‌గ‌న్‌కు వ్యాపారంలో భాగ‌స్వామిగా ఉన్నారని చెప్పే నాగార్జున, తన మిత్రుడు చిరంజీవితో కలిసి గ‌ట్టిగా మ‌ద్ద‌తిచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో ఏపీ ప్ర‌భుత్వం థియేట‌ర్ టికెట్ల వ్య‌వ‌హారంలో గ‌ట్టిగా వ్య‌వ‌హ‌రించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ చిత్రాలు విడుద‌ల‌య్యే స‌మాయానికి వాటి ధ‌ర‌లు బాగా త‌క్కువ‌గా ఉండేలా జీవో తీసుకువ‌చ్చిందంటూ ఆయన అభిమానులు రగడ చేశారు. ఆ నేప‌థ్యంలోనే చిరంజీవి ఇత‌ర క‌థానాయ‌కులు, దర్శ‌కులు మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, ప్ర‌భాస్ త‌దిత‌రుల‌ను తీసుకొని తాడేప‌ల్లిలో సీఎంను క‌లిశారు. ఆ స‌మావేశానికి నాగార్జున రాక‌పోయిన‌ప్ప‌టికీ మ‌ద్ద‌తు ప‌లికారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం కొన్ని విధివిధానాల‌ను రూపొందించి సినీ పరిశ్రమకు వెసులుబాటు కల్పించింది.

సినిమాలు విడుద‌ల‌య్యే స‌మ‌యంలో బ‌డ్జెట్‌ను బ‌ట్టి వారం, లేదంటే రెండువారాలు అత్య‌ధిక ధ‌ర‌లు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఈ నిర్ణయం బెడిసికొట్టి అభిమానులు థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప‌రిస్థితులు క‌న‌ప‌డక‌పోవ‌డంతో అగ్ర కథానాయకులు, దర్శకులంతా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. త‌ర్వాత నుంచి మా సినిమాకు పాత ధరలే ఉంటాయి.. పెంచడంలేదంటూ ప్రకటనలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే అక్కినేని నాగార్జున త‌న బంగార్రాజు విజ‌యోత్స‌వాన్ని రాజ‌మండ్రిలో నిర్వ‌హించారు. తాజాగా ద ఘోస్ట్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌ను హైద‌రాబాద్‌లో కాకుండా క‌ర్నూలులో నిర్వ‌హించారు. సాధార‌ణంగా చిత్ర ప‌రిశ్ర‌మ ఇక్క‌డే ఉంటుంది కాబ‌ట్టి ప్రి రీలీజ్‌, ఆడియో ఫంక్ష‌న్ల లాంటివి దాదాపుగా హైద‌రాబాద్ లోనే జ‌రుగుతాయి. దానికి భిన్నంగా ఏపీలో నిర్వహించేలా నాగార్జున ప్రణాళికా బద్ధంగా వ్యవహరించారు.

ప్రస్తుతం చిరంజీవి కూడా త‌న గాడ్ ఫాద‌ర్ చిత్రం ప్రిరీలీజ్ వేడుక‌ల‌ను అనంత‌పురంలో చేయబోతున్నారు. ఈనెల 28వ తేదీన వేడుక జ‌ర‌గ‌బోతోంది. సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎక్కువ ఆదాయం కూడా ఏపీనుంచే వ‌స్తోంది. అత్య‌ధిక ఆదాయాన్నిచ్చే రాష్ట్రంగా ఉన్న ఏపీలో ప్ర‌స్తుతం సినీ షూటింగ్‌లు అతి త‌క్కువ‌గా జ‌రుగుతున్నాయి. ప‌న్ను మిన‌హాయింపులిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నప్పటికీ తెర‌కెక్కేవ‌న్నీ పాన్ ఇండియా సినిమాలు కావ‌డంతో హైద‌రాబాద్ లాంటి న‌గ‌రాల‌చుట్టూ తిరుగుతున్నాయి. క‌థ‌ను బ‌ట్టి ఇత‌ర ప్రాంతాల్లో తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ చిరంజీవి, నాగార్జున వైఎస్ జగన్ కు గట్టి మద్దతుదారులుగా నిలబడటం ఆ పార్టీలో ఉత్సహాన్ని నింపుతోంది. వైసీపీ నేతలంతా నాగార్జునను, నాగార్జున సినిమాల‌ను త‌మ‌విగానే భావిస్తారు.