వైఎస్సార్ వదిలిన బాణాన్ని; మాటలతో చీల్చి చెండాడుతున్న వైఎస్ షర్మిల!!

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వ తీరుపై, సీఎం కేసీఆర్ పాలన పై తనదైన శైలిలో నిప్పులు చెరుగుతూ ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తున్న షర్మిల నియోజకవర్గ ఎమ్మెల్యే లను టార్గెట్ చేస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి పై ప్రశ్నిస్తున్నారు. ప్రజలు అవకాశం ఇస్తే ఏం చేశారంటూ నిలదీస్తున్నారు.

ప్రజలకు అరచేతిలో వైకుంఠం; ఎనిమిదేళ్లుగా ఆడిందే ఆట; మోసగాడు కేసీఆర్: వైఎస్ షర్మిల ధ్వజంప్రజలకు అరచేతిలో వైకుంఠం; ఎనిమిదేళ్లుగా ఆడిందే ఆట; మోసగాడు కేసీఆర్: వైఎస్ షర్మిల ధ్వజం

తాజాగా సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేయడం తో పాటు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని వైయస్ షర్మిల తూర్పారబట్టారు. ఇక బతుకమ్మ చీరల విషయంలోనూ వైయస్ షర్మిల కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు. రోజుకో పార్టీ మారే ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. నేను బిజెపి వదిలిన బాణాన్ని అంటూ నరం లేని నాలుకలా మాట్లాడుతున్నాడు అని వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు. రోజుకో పార్టీ మార్చి జగ్గారెడ్డి కూడా విమర్శలు చేసే వాడని మండిపడ్డారు.

జగ్గారెడ్డి మొదట టిఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్, మళ్లీ బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయ్యా! జగ్గారెడ్డి.. నేను వైఎస్సార్ వదిలిన బాణాన్ని. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడానికి వచ్చిన బాణాన్ని.. నీకు చేతనైతే హామీలు నెరవేర్చు అంటూ వైయస్ షర్మిల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కి సెటైర్లు వేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అసహనం వ్యక్తం చేశారు.

ఇచ్చినట్టు కేసీఆర్, కేటీఆర్ దిక్కుమాలిన ప్రచారాలు
అంతేకాదు ప్రజల సొమ్ముతో చీరెలు పంచుతూ.. సీఎం కేసీఆర్, కేటీఆర్ సొంత సొమ్ముతో ఇచ్చినట్లుగా దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నారని వైయస్ షర్మిల విమర్శించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు. చీరెల పైసలు కెసిఆర్ కాళేశ్వరం కమీషన్ల నుంచి ఇచ్చారా? కేటీఆర్ బినామీ కంపెనీల నుంచి ఇచ్చారా? లేక ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి ఇచ్చారా? సమాధానం చెప్పాలని వైయస్ షర్మిల నిలదీశారు.

ఇదే సమయంలో సంగారెడ్డి కలెక్టర్ పై వైఎస్ షర్మిల మండిపడ్డారు. సంగారెడ్డి కలెక్టర్ టిఆర్ఎస్ కండువా కప్పుకొని డ్యూటీ చేస్తున్నాడా? అని వైయస్ షర్మిల ప్రశ్నించారు. కెసిఆర్ అంబేద్కర్ లా నీ కంటికి ఎలా కనిపించాడు నాయనా అంటూ నిలదీశారు. రాజ్యాంగాన్ని అవమానించినందుకా? దళితున్ని ముఖ్యమంత్రిని చేయనందుకా? మూడెకరాల భూమి ఇవ్వనందుకా? దళితుల భూములు గుంజుకున్నందుకా? అంటూ వైఎస్ షర్మిల తనదైన శైలిలో కలెక్టర్ ని టార్గెట్ చేశారు. ఇక ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆడబిడ్డ లతో కలిసి బతుకమ్మ ఆడిన వైయస్ షర్మిల వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడానికి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.