లెక్క తేలని క్రికెట్ మ్యాచ్ టికెట్లు చాలా ఉన్నాయి!!

భార‌త‌-ఆస్ట్రేలియా మ‌ధ్య చివ‌రి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భ‌రితంగా మారింది. ఇరు జ‌ట్లు చెరో మ్యాచ్ గెల‌వ‌డంతో చివ‌రి మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది. దాదాపు మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత బీసీసీఐ మ్యాచ్‌ను హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంకు కేటాయించింది. క‌రోనా నేప‌థ్యంలో స్టేడియంలో నిర్వ‌హ‌ణ లేదు. మ్యాచ్‌కు అనువైన‌దిగా లేద‌ని హెచ్‌సీఏనే చెబుతోంది. అలాంట‌ప్పుడు మ్యాచ్ నిర్వ‌హించేందుకు ఎందుకు ఒప్పుకున్నార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు.

టికెట్ల కోసం వేల‌మంది తెల్ల‌వారుజాము నుంచే లైనులో నిల‌బ‌డిన‌ప్ప‌టికీ కేవ‌లం 2వేల టికెట్లు అమ్మి చేతులు దులుపుకున్నారు. తొక్కిస‌లాట జ‌రిగి ఎంతోమంది అభిమానులు గాయ‌ప‌డ్డారు. వారికి క్రికెట్ మీద ఉన్న ప్రేమ‌ను పెద్ద‌లు మ‌రోవిధంగా ఉప‌యోగించుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి పెద్ద‌గా స‌మ‌యం లేక‌పోయిన‌ప్ప‌టికీ 13 వేల టికెట్ల‌కు లెక్క తేల‌లేదు.

స్టేడియం కెపాసిటీ మొత్తం 55వేలు కాగా 34వేల‌మందిని అనుమ‌తిస్తారు. ఇందులో ఆట‌గాళ్ల‌కు, స్పాన్స‌ర్ల‌కు 4500 టికెట్లు కేటాయించారు. అవి పోను 29,500 టికెట్లు అమ్మ‌కానికి ఉంచారు. అయితే టికెట్ల‌ను బ్లాక్‌లో అమ్ముతున్నార‌ని, ఇందులో 40 కోట్ల స్కాం జ‌రిగింద‌ని తెలంగాణ క్రికెట్ సంఘం నేత గుర‌వారెడ్డి ఆరోపించారు. రూ.1500 టికెట్ ను బ్లాక్‌లో రూ.5వేల నుంచి రూ.10వేల‌కు అమ్ముతున్న‌ట్లు స‌మాచారం.

స్టేడియం నిర్వ‌హ‌ణ స‌రిగా లేక‌పోవ‌డంతో మ్యాచ్ స‌జావుగా సాగుతుందా? లేదా? అనే అనుమానం క్రికెట్ ప్రేమికుల్లో క‌లుగుతోంది. టికెట్ల అమ్మకాలు తమ చేతిలో లేవని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు. ఆన్ లైన్ లో ఎన్ని టికెట్లు అమ్మాం.. ఆఫ్ లైన్ లో ఎన్ని టికెట్లు అమ్మామనేది ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. టికెట్ అమ్మకాలు బీసీసీఐ చూసుకుంటుందని చెప్పిన అజారుద్దీన్ తర్వాత నివేదిక రూపంలో ప్రభుత్వానికి చెబుతానమనడంపై క్రికెట్ ప్రేమికులంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.