రైతుల పాదయాత్ర ఎలా ఆగుతుందో చూస్తారా: బొత్స

అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన పాద‌యాత్ర‌పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. క‌న్నెర్ర చేస్తే పాద‌యాత్ర ఆగిపోతుంద‌ని, కానీ తాము అలా చేయ‌మ‌న్నారు. ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే మ‌రోసారి వ్యాఖ్య‌లు చేశారు. తాము క‌న్నెర్ర చేస్తే యాత్ర‌లు ఆగిపోతాయ‌ని, త‌లుచుకుంటే ఐదు నిముషాల్లోనే ప‌ద‌యాత్ర‌ను ఆపుతామ‌ని తాను అన్న‌మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రాష్ట్రాన్ని స‌మానంగా అభివృద్ధి చేయకుండా మ‌రో ప్రాంతంలో అభివృద్ధి జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్ర‌శ్నించారు. గ‌త ప్ర‌భుత్వం రైతుల‌తో ఒప్పందాలు చేసుకుంద‌ని, వాటిని తాము అమ‌లు చేస్తున్నామ‌న్నారు. అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌ను ఎలా ఆప‌గ‌ల‌మో చూస్తారా? అన్నారు. త్యాగం అంటే వారిది కాద‌ని, పోల‌వ‌రం, నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టుల‌కు భూములు ఇచ్చిన రైతుల‌ద‌ని బొత్స అన్నారు. అమ‌రావ‌తి రైతులు ప్ర‌భుత్వం నుంచి ప్ర‌యోజ‌నం పొందార‌ని, వారు చేసింది త్యాగం ఎలా అవుతుంద‌ని, ప్రాజెక్టుల‌కు భూములిచ్చిన‌వారిదే త్యాగ‌మ‌ని మ‌రోసారి ఉద్ఘాటించారు.

విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. తాము సంస్కారం క‌ల‌వారిమ‌ని, యాత్ర చేసేది రైతులు కాద‌ని, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌న్నారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల యాత్ర అని, కావాలంటే తాము క్ష‌ణంలోనే ఆప‌గ‌ల‌మ‌న్నారు. విశాఖపట్నం రాజధానిగా వస్తే ఉద్యోగాలు రావడంతోపాటు పరిశ్రమలు కూడా వస్తాయని, ఇంకా ఎన్నో ప్రయోజనాలుంటాయన్నారు. తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని, అలా జరగకపోతే తాను మంత్రి పదవికి అనర్హుడినని అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకే కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని నిర్ణయించామన్నారు.