రేణిగుంట ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం – వైద్యుడితో సహా ముగ్గురి మృతి..!!

తిరుపతి జిల్లా రేణిగుంటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భగత్ సింగ్ నగర్ లోని కార్తిక చిన్నపిల్లల ఆస్పత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఆస్పత్రి మొత్తం వ్యాపించాయి. ఆస్పత్రి నిర్వహిస్తున్న వైద్యుడి కుటుంబం అదే ఆస్పత్రి పైనే ఉంటోంది. దీంతో..మంటలు వారి నివాసానికి వ్యాపించాయి. వైద్యుడి కుటుంబం కూడా ఆ మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

తక్షణం స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. అతికష్టం మీద ఇంట్లోకి చేరుకుని వైద్యుడు రవిశంకర్‌రెడ్డి భార్య, అత్తతోపాటు ఇద్దరు పిల్లలను మంటల్లో నుంచి బయటకు తీసుకొచ్చింది. ఆస్పత్రిలో చెలరేగిన మంటలతో పెద్ద ఎత్తున పొగ కమ్మేయటంతో ఊపిరి అందక వారంతా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ పొగ కారణంగా చిన్నారులు కార్తీక, భరత్‌ అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా మారటంతో తిరుపతిలో ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆ ఇద్దరు మృతి చెందారు.

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పైన అంతస్తులో ఉన్న ఆస్పత్రి వైద్యుడు రవిశంకర్ రెడ్డి చుట్టూ మంటలు దట్టంగా అలముున్నాయి. దీంతో..ఆయన అక్కడే సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. వైద్యుడిని కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నాలు జరిగినాయి. కానీ, ఫలించలేదు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతరులకు నష్టం జరగకుండా చర్యలు తీసకున్నారు. అయితే, వైద్యుడుతో పాటుగా మరో ఇద్దరు మృతి చెందటంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి.