రెండురోజుల పాటు తిరుమలలో వైఎస్ జగన్ – తొలిసారి అక్కడికి..!!

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారికి ఏటా నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం తిరుమల ముస్తాబయింది. మంగళవారం బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగుతాయి. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రానున్న నేపథ్యంలో- అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని ఇదివరకే పూర్తి చేశారు. కిందటి మంగళవారం ఈ కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలేశుడిని దర్శించడానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నారు. దీనిపై పలుమార్లు సమీక్షలు నిర్వహించారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో 64 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన పార్క్‌ను టీటీడీ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీతరిగొండ వెంగమాంబ అన్నదానం సత్రాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సహా ఇతర అధికారులు సందర్శించారు. అక్కడి ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 5వ తేదీ వరకు భక్తుల తాకిడి అసాధారణంగా ఉంటుందని, దీనికి అనుగుణంగా భోజన సౌకర్యాలను కల్పించాలని అధికారులు ఆదేశించారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలను సందర్శించనున్నారు. రాష్ట్ర ప్రజల తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఎల్లుండి వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. టీటీడీ కొత్తగా నిర్మించిన పరకామణి మండపాన్ని బుధవారం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభిసారు.

తిరుమలను కాలుష్యరహితంగా మార్చడంలో భాగంగా ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకుని వస్తారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన కొత్త అతిథి భవనాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.

అనంతరం రోడ్డు మార్గంలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తొలిసారిగా ఆయన గంగమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారు. తొలిదశలో 10 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి ఊరేగింపుగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. పెదశేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆ మరుసటి రోజు పరకామణి మండం, కొత్త అతిథి భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు.