రాజస్తాన్ ఎఫెక్ట్-కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి గెహ్లాట్ అవుట్ ? కొత్తగా చేరేది వీరే..

రాజస్తాన్ లో సీఎంగా పనిచేస్తూ, అనూహ్యంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులోకి వెళ్లిన అశోక్ గెహ్లాట్ అంతే వేగంగా వెనకడుగు వేయాల్సిన పరిస్దితులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపికైనా రాజస్తాన్ సీఎంగా కొనసాగుతానంటూ మొండికేసిన గెహ్లాట్ కు ఒకే వ్యక్తికి ఒకే పదవి నిబంధన తొలి షాకిచ్చింది. అనంతరం రాజస్దాన్ సీఎంగా తన అనుయాయుడు సీపీ జోషిని నియమించాలని పట్టుబట్టిన గెహ్లాట్ కు అధిష్టానం మరోసారి షాకిచ్చింది. తన ప్రత్యర్ధి సచిన్ పైలట్ ను రాజస్తాన్ సీఎంగా నియమించేందుకు సిద్ధమైంది. దీంతో అధిష్టానాన్నే బెదిరించేలా తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించేందుకు ప్రయత్నించిన గెహ్లాట్ అక్కడ కూడా విఫలమయ్యారు.

నిన్న రాజస్తాన్ సీఎల్పీ భేటీకి 82 మంది పార్టీ ఎమ్మెల్యేల్నిదూరం చేసిన గెహ్లాట్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. ముఖ్యంగా తాము పరిశీలకులుగా పంపిన మల్లిఖార్గున ఖర్జే, అజయ్ మాకెన్ ను లెక్కచేయకుండా సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టి వేరే సమావేశంపెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని నడిపిస్తున్నదెవరో కనిపెట్టింది. దీంతో ఈ వ్యవహారంలో అశోక్ గెహ్లాట్ దోషిగా మారిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష రేసులో నుంచి ఆయన్నుతప్పించాలనే డిమాండ్లు సీనియర్ల నుంచి వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన రేపు నామినేషన్ వేయకపోవచ్చని తెలుస్తోంది.

అధిష్టానం అభిప్రాయానికి వ్యతిరేకంగా రేపు గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తే ఆయనకు బదులుగా మరో నేతకు మద్దతు లభించే అవకాశముంది. అప్పుడు గెహ్లాట్ కు రాజస్తాన్ లోనూ ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. దీంతో గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ వేయకపోవచ్చని తెలుస్తోంది. తద్వారా కనీసం తాత్కాలికంగా అయినా రాజస్తాన్ సీఎం పదవిని కాపాడుకోవచ్చని అర్ధమవుతోంది. మరోవైపు గెహ్లాట్ రేసు నుంచి తప్పుకుంటే ఆయన స్ధానంలో మరో ముగ్గురు నేతలు రేసులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.వీరిలో దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.