రాజకీయాలపై “మెగా” ట్విస్ట్ – చిరంజీవి అదే కోరుకున్నారా..!!

ఏపీ రాజకీయాల్లో “మెగా” చర్చ ఆగటం లేదు. నాలుగు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ఒక ఆడియో సందేశం పొలిటికల్ సర్కిల్స్ పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. అది చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ లో డైలాగ్. కానీ, ఆయన రాజకీయ యాత్రకు సరిగ్గా సరిపోయిన డైలాగ్ కావటం..ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ ఆడియో సందేశం ప్రకంపనలకు కారణమైంది. ఆ వీడియో సందేశం లో చిరంజీవి.. “నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు”..అని చెప్పుకొచ్చారు.

ఈ ఆడియో సందేశం స్వయంగా చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయటంతో ఇది సినిమా డైలాగ్ అయినా.. రాజకీయంగానే చర్చ సాగింది. మళయాలం రీమేక్ గా నిర్మాణం పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్ లో చిరంజీవి పొలిటికల్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీగా ఈ సినిమా విజయదశమి నాడు విడుదల కానుంది. ఇక, ఈ ఆడియో సందేశం విడుదల అయిన తరువాత అనూహ్యంగా కాంగ్రెస్ నేతలకు చిరంజీవి గుర్తుకు వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా చిరంజీవిని పీసీసీ డెలిగేట్ గా 2027 వరకు కొనసాగిస్తూ కొత్తగా సీడబ్ల్యూసీ ఎన్నికల విభాగం ఒక కార్డు జారీ చేసింది. పశ్చిమ గోదావరి కోవూరు నియోజకవర్గంలో చిరంజీవికి బాధ్యతలు కేటాయించారు.

గతంలో ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా – కేంద్ర మంత్రిగా కొనసాగారు. 2014 పరిణామాల తరువాత ఆయన కాంగ్రెస్ కు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కానీ, పార్టీకి అధికారికంగా రాజీనామా చేయలేదు. దీంతో..అప్పటికే పీసీసీ డెలిగేట్ గా ఉన్న చిరంజీవిని మరోసారి బాధ్యతలు కొనసాగిస్తూ ఈ నిర్ణయం జరిగింది. దీని పైన చిరంజీవి స్పందించ లేదు. రాజకీయాలను తాను దూరంగా ఉన్నానని చెబుతున్నారే కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని – లేదు బయటకు వస్తున్నానని మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. దీంతో, కాంగ్రెస్ నేతలు చిరంజీవి ఇంకా తమతో ఉన్నారనే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు తన వీడియో సందేశం తరువాత జరిగిన రాజకీయ చర్చ పైన చిరంజీవి స్పందించారు. తన ఆడియో మోసేజ్ ఇంతలా చర్చకు దారి తీస్తుందని తాను ఊహించలేదని చెప్పారు. అది కూడా మంచిదే అంటూ వ్యాఖ్యానించారు.

గతంలో చిరంజీవి సినిమా పరిశ్రమ వ్యవహారాలపైన ఏపీ సీఎం జగన్ తో పలు మార్లు భేటీ అయ్యారు. ఆ సమయంలో వైసీపీ నుంచి చిరంజీవి రాజ్యసభకు వెళ్లనున్నారనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో చిరంజీవి తాను రాజకీయాలకు దూరమని.. ఇక సినిమాలపైనే తాను ఫోకస్ చేసానని స్పష్టం చేసారు. ఇప్పుడు మెగాఫ్యాన్స్ జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. చిరంజీవి కోసం బీజేపీ ప్రయత్నాలు చేసినా అటువైపు మళ్లే అవకాశం లేదు. ఈ సమయంలో చిరంజీవి తన రాజకీయ నిర్ణయం పైన మార్పు లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ సారి ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి ప్రత్యక్షంగా రాకపోయినా.. పరోక్షంగా మద్దతిస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంచనాల నడుమ..చిరంజీవి పొలిటికల్ పాత్ర పైన మరో సారి ఆసక్తి కర చర్చ కొనసాగుతోంది.