రఘురామకృష్ణంరాజు తర్వాత నియోజకవర్గం??

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నరసాపురం నుంచి రెబెల్ ఎంపీగా కొన‌సాగుతున్న ర‌ఘురామ‌కృష్ణంరాజు రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ త‌ర‌ఫున పోటీచేయ‌బోతున్నార‌నే ఆస‌క్తి ప్రజల్లోనే కాకుండా పార్టీల్లో కూడా నెల‌కొంది. ర‌ఘురామ ఎంపీ అయిన కొన్నాళ్లు వైసీపీకి విధేయుడిగానే ఉన్నారు. తాను జ‌గ‌న్‌ను క‌ల‌వ‌కుండా కొంద‌రు అడ్డుపడుతున్నార‌ని ఆయన ఆరోపణలు చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్యాప్ అంతకంతకూ పెరిగి తీవ్ర‌స్థాయికి మారింది. ఆ త‌ర్వాత రాష్ట్రంలో అనేక రాజ‌కీయ ప‌రిణామాలు సంభ‌వించాయి.

తాజాగా రఘరామకృష్ణంరాజు రాబోయే ఎన్నిక‌ల్లో కాకినాడ‌ నుంచి ఎంపీగా పోటీచేసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా మారిన తర్వాత రఘురామకు చాలా విష‌యాల్లో తెలుగుదేశం పార్టీ మ‌ద్ద‌తుగా నిలిచింది. దీంతో స్వ‌త‌హాగా ఆయ‌న టీడీపీ త‌ర‌పున పోటీచేస్తార‌ని భావించారు. ఆ భావనలకు ఊతమిస్తూ రానున్న ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కాకినాడ నుంచి పోటీచేసుకోవ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అక్కడి నుంచి పనిని ప్రారంభించారు.

కాకినాడ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. పార్టీల‌వారీగా బ‌లాబ‌లాలు.. సామాజిక వర్గాలు.. తదితర విష‌యాల‌న్నింటినీ ఆయ‌న క్రోడీక‌రించుకొని బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. నరసాపురం నుంచే టీడీపీ తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నప్పటికీ గత ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి ఓట‌మిపాలైన వేటుకూరి వెంక‌ట‌శివ‌రామ‌రాజు నే ఈసారి కూడా టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో కాకినాడలో పనిచేసుకోవాలని సూచించడంతోపాటు ఆయన అంగీకరించారు.

గ‌తంలో సినీ నటుడు కృష్ణంరాజు కూడా కాకినాడ నుంచి బీజేపీ తరఫున విజ‌యం సాధించ‌డం, నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో క్ష‌త్రియులు, కాపులంతా మ‌ద్ద‌తు ప‌లుకుతార‌నే ఉద్దేశంతో దీన్ని ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థుల గుణగణాలను బట్టి ఇక్కడి ఓటర్లు ఓటు వేస్తారు. అయితే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్ పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచే రఘురామకృష్ణంరాజు ఎక్కడి నుంచి బరిలోకి దిగానా ఓడించాలనే పట్టుదల వైసీపీ శ్రేణుల్లో నెలకొంది. వారి ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించి ఇక్కడి నుంచి రఘురామ విజయం సాధించగలరా? లేదంటే ఆయన్ను ఓడించేందుకు నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తారా? అన్నది తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.