“మోడీ, ఆర్ఎస్ఎస్‌కు దసరా బోనస్!!”

పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయ జనతాపార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పీఎఫ్‌ఐ కుట్రలు పన్నుతున్నట్లు తేలింది. ఈ నేతల కదలికలపై దసరా నవరాత్రుల వేళల్లో ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని పీఎఫ్‌ఐ ప్రణాళికలు రచించించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం తెలిపింది.

నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం కూడా పీఎఫ్‌ఐ లిస్టులో ఉందని, విజయ దశమి సందర్భంగా మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సభ్యుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పీఎఫ్ఐ ప్రణాళికలు అల్లింది. దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నినట్లు, బీజేపీ, సంఘ్‌నేతలతో పాటు వివిధ ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులు కూడా వీరికి టార్గెట్ అయినట్లు తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపై ఈ సంస్థ సభ్యులు రెక్కీలు నిర్వహించారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి. దీంతో ఆయా నేతలు, సంస్థలకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది.

గతవారం పీఎఫ్‌ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఐఏ, ఇతర దర్యాప్తు ఏజెన్సీలు దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులకు దిగాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేయడంతోపాటు అత్యధికంగా కేరళ నుంచి 22 మందిని, మహారాష్ట్రలో 20 మందిని అరెస్ట్ చేశారు. సోదాల్లో ఎన్‌ఐఏ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో వారి సమాచారం, ప్రణాళికలు బయటకు వచ్చాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతోపాటు లష్కరే తోయిబా, ఐసిస్‌, అల్‌ఖైదా వంటి ఉగ్రవాదుల ముఠాల్లో చేరేలా ఇక్కడి యువతను ప్రేరేపిస్తున్నట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది.

ప్రధానమంత్రి మోడీని ఇప్పటికే టార్గెట్ చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు, గుంటూరు ఆటోనగర్ తోపాటు తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని అధికారులు హైదరాబాద్ కు తరలించి ప్రశ్నిస్తున్నారు. నిధుల సేకరణ ఎలా? యువతను ఎక్కడకు పంపిస్తున్నారు? తదితర విషయాలపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు.