మెగాస్టార్ పై విజయసాయిరెడ్డి పొగడ్తల జల్లు-గాడ్ ఫాదర్ మూవీ బ్యాక్ గ్రౌండ్..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి దగ్గరైన మెగాస్టార్ చిరంజీవిపై ఇప్పటికీ ఆ పార్టీ నేతలు ఎనలేని అభిమానం చూపిస్తుంటారు. కమ్మ సామాజికవర్గం ప్రభావం కనిపించే టాలీవుడ్ లో బాద్ షా గా ఎదిగిన చిరంజీవిని ప్రోత్సహించాలనే రాజకీయ ఆలోచనలో భాగమని కొందరు, తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ ను దూరం చేసేందుకే చిరంజీవిని ప్రోత్సహిస్తున్నారని మరికొందరు విమర్శిస్తుంటారు. కానీ వైసీపీ నేతలు మాత్రం మెగాస్టార్ ను మాత్రం వదిలిపెట్టడం లేదు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి మళయాళ చిత్రం లూసిఫర్ కు రీమేక్ గా రూపొందిన తెలుగు చిత్రం గాడ్ ఫాదర్ లో నటించారు. ఈ చిత్రం వచ్చేనెల 5 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఏపీలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చిరంజీవిని ఉద్దేశించి ఇవాళ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో చిరంజీవిపై సాయిరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. గాడ్ ఫాదర్ మూవీతో పాటు వ్యక్తిగతంగా చిరంజీవిని కూడా అభినందిస్తూ సాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి సందేశాత్మక చిత్రం గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండటం సంతోషకరమంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆయనకు తన శుభాకాంక్షలు తెలిపారు. నాలుగుదశాబ్దాలుగా చిత్రసీమను రంజింపచేస్తున్న మెగాస్టార్ లో అదే ఉత్సాహం, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ వైసీపీ ఎంపీ ప్రశంసల జల్లు కురిపించారు. గాడ్ ఫాదర్ చిత్రాన్ని సందేశాత్మక చిత్రంగా పేర్కొన్న సాయిరెడ్డి, ఇండస్ట్రీపై చిరంజీవి ప్రభావాన్ని కూడా కలిపి ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.