మునుగోడులో కమలం కొత్తవ్యూహం.. తెలంగాణా సర్కార్, కేసీఆర్ పాలనా వైఫల్యాలపై బీజేపీ చార్జ్ షీట్!!

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. మునుగోడు లో జరగనున్న ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ఫ్రీ ఫైనల్ గా భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల మద్దతు కోసం రకరకాల వ్యూహాలతో ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని దూకుడుగా ముందుకు వెళ్తుంది. ప్రతిపక్షాలను చిత్తు చేసే ప్లాన్ తో ముందుకు వెళ్తుంది.

మునుగోడులో బీజేపీ ముందంజ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కలిసొస్తున్న అంశాలివే!!మునుగోడులో బీజేపీ ముందంజ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కలిసొస్తున్న అంశాలివే!!

ఇక ఇటీవల తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన 16 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీ మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోతో పాటు అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పేర్కొంటూ ‘ఛార్జ్ షీట్’ను విడుదల చేయాలని నిర్ణయించింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దళిత బంధును ప్రకటించారని, ఇప్పుడు గిరిజన బంధును ప్రకటించారని , కేవలం ఎన్నికల కోసమే ఈ పథకాలను ప్రకటిస్తున్నారని ప్రచారం చేయనుంది.

కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చోటుచేసుకున్న పాలనా వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలియజేయడంతో పాటు, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఏం జరిగింది అనేది కూడా ప్రధానంగా ఛార్జిషీట్ ద్వారా తెలియజేయనుంది. అంతేకాదు మునుగోడులో ప్రతి గ్రామంలో ప్రచారం చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రతి గ్రామంలోనూ పాదయాత్ర చేపట్టాలని ప్లాన్ చేసినట్టుగా సమాచారం. గ్రామాల వారీగా కమిటీలు, మండలాల వారీగా ఇంచార్జి లను నియమించిన బిజెపి, వారి ద్వారా నిర్వహించిన సర్వేలపై అధ్యయనం చేసింది.

సర్వే ఫలితాలపై బిజెపి స్టీరింగ్ కమిటీ దృష్టి పెట్టింది. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను, ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే ఎత్తుగడలను చర్చించింది. మాజీ ఎంపీ జి. వివేక్‌ వెంకటస్వామి నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే కీలక సమావేశాన్ని నిర్వహించి పార్టీ శ్రేణులకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. చౌటుప్పల్‌, నారాయణపూర్‌, మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడెంతో పాటు ఏడు మండలాలకు ఇన్‌చార్జి, ఇద్దరు సహాయ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.

ప్రత్యర్ధి పార్టీల ఎత్తుగడలను ఎలా చిత్తు చెయ్యాలి అన్న అంశంపై ప్రధానంగా చర్చించిన బీజేపీ నేతలు, రివర్స్ ఎటాక్ చెయ్యటానికి వ్యూహం రచించింది. ఇప్పటికే బీజేపీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా బీజేపీ అనుబంధ సంఘాలను ఈ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపి స్టీరింగ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ముందుకు వెళుతుంది.