మీరు వచ్చారనే భోజనం బాగుంది: కేటీఆర్‌తో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, మెచ్చుకున్న మంత్రి

ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన పోరాటం తనకు నచ్చిందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వర్సిటీ విద్యార్థులతో సోమవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డిమాండ్లు
పరిష్కరించాలంటూ విద్యార్థులు చేసిన ఆందోళనలు పత్రికలు, టీవీల్లో చూసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా విద్యార్థులు తమంతట తామే ఆందోళన చేశారన్నారు. సమ్మె కోసం విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి నచ్చిందన్నారు కేటీఆర్. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని కొనియాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే సమ్మె చేస్తున్నామని స్పష్టంగా చెప్పారని అన్నారు.

Earlier, Minister KTRTRS had lunch with the students of RGUKT_Basara and interacted with them. pic.twitter.com/hvQM9a0Lqs

మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించాలని విద్యార్థులు మంత్రిని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆడిటోరియంలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేస్తామన్నారు. తన జీవితంలో 70 శాతం హాస్టల్‌లోనే గడిచిందని, హాస్టల్ కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని అన్నారు కేటీఆర్. సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించేందుకు సమయం పడుతుందన్నారు. తాను వచ్చాననే ఈరోజు భోజనం బాగుందని కొందరు విద్యార్థులు చెప్పారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారితో కలిసి భోజనం చేశారు మంత్రి కేటీఆర్.

Live : Minister KTRTRS speaking at RGUKT Campus, Basara. https://t.co/I1pdqkJ21X

మెస్ బాగాలేదని.. కొత్త మెస్సే ఇలావుంటే.. పాత మెస్ ఎలా ఉంటుందోనని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలేజీ సమస్య తీవ్రతను గుర్తించి అధికారులను నియమించామని, అతి త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కేటీఆర్ తెలిపారు. రెండు నెలల తర్వాత సబితా ఇంద్రారెడ్డిని ఇక్కడికి తీసుకొస్తానని, నవంబర్ నెలలో అందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యార్థులు ఇన్నోవేటివ్‌గా ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ చెప్పారు. పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. ఇన్నోవేషన్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లకే అర్థం అవుతుందని అనుకోవద్దని సూచించారు. యూనివర్సిటీలో మినీ టీ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు.