మరో ఆపరేషన్ షురూ: చేతులెత్తేసిన అశోక్ గెహ్లాట్ – కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు..!!

జైపూర్: రాజస్థాన్‌లో ఆపరేషన్ డెజర్ట్ ఆరంభమైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పెను సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ శాసన సభ్యులందరూ తిరుగుబాటు లేవదీశారు. మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధపడ్డారు. రాత్రికి రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్ హైకమాండ్‌కు మింగుడు పడట్లేదు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గె, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్‌ను హుటాహుటిన రాజస్థాన్‌కు పంపించింది.

అశోక్ గెహాట్.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినాయకుడిగా నియమితులవుతారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడింది. ఇంకో రెండు మూడు రోజుల్లో ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్ కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఉండటం వల్ల అశోక్ గెహ్లాట్ గనక ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైతే- ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన స్థానంలో సచిన్ పైలెట్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తారని, రెండో ఆప్షన్‌గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యువనేత వైపే మొగ్గు చూపారంటూ వార్తలు సైతం వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య అశోక్ గెహ్లాట్- ఆదివారం సాయంత్రం తన నివాసంలో కాంగ్రెస్ సభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు.

దీనితో- కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు మొదలైంది. అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి అందజేశారు. ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ మాత్రమే కొనసాగాల్సి ఉంటుందని లేదా సచిన్ పైలెట్‌కు బదులుగా మరొకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలనేది వారి డిమాండ్. 2020లో పార్టీలో అనిశ్చిత పరిస్థితులకు కారణమైన సచిన్ పైలెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా అంగీకరించబోమని తేల్చి చెప్పారు.

సచిన్ పైలెట్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు ఉన్నందునే అందుకు నిరసనగానే తాము శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశామని వివరించారు. అశోక్ గెహ్లాట్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోని సీనియర్ నాయకులు.. మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం దూతలుగా వచ్చిన మల్లికార్జున ఖర్గె, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కావడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు.

ఈ పరిణామాలన్నింటిపైనా అశోక్ గెహ్లాట్ స్పందించారు. తన చేతుల్లో ఏమీ లేదని స్పష్టం చేశారు. అది ఎమ్మెల్యేల నిర్ణయమని, తాను ఏమీ చేయలేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీ కానున్నట్లు తెలిపారు. ఒక్కొక్క శాసన సభ్యుడి అభిప్రాయాన్ని సేకరిస్తామని, మెజారిటీ నిర్ణయాలకు అనుగుణంగా తదుపరి చర్యలను తీసుకుంటామని అజయ్ మాకెన్ చెప్పారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సోనియా గాంధీకి అప్పగిస్తామని, తుది నిర్ణయం ఆమెదేనని స్పష్టం చేశారు.