బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో ఆణిముత్యం

బెల్లంకొండ సురేశ్ ఈ పేరుతో తెలుగు సినీ పరిశ్రమకు పెనవేసుకున్న అనుబంధం ఈనాటిది కాదు. ఆయన నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఎన్నో హిట్స్, బ్లాక్ బస్టర్స్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి టాలీవుడ్ ను నిలబెట్టాయి. తెలుగు సినిమాకు భారీతనాన్ని తీసుకువచ్చిన అతి కొద్ది మంది నిర్మాతల్లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక ఆయన సినీ వారసత్వాన్ని ముందుకు నడిపించేందుకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా అన్నకు తోడుగా తమ్ముడు గణేశ్ కూడా బరిలోకి దిగిపోయాడు.

స్వాతిముత్యం సినిమాతో ఇండస్ట్రీలో యాక్టర్ గా తన లక్ ను టెస్ట్ చేసుకునేందుకు బెల్లంకొండ గణేశ్ బాబు సిద్ధమయ్యాడు. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గణేశ్, వర్షా బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ట్రైలర్ ద్వారా ఇది పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రమని అర్థమవుతోంది. ముఖ్యంగా తొలి సినిమాతోనే గణేశ్ ఒక యాక్టర్ గా రాణించేందుకు గట్టిగానే కష్టపడ్డాడని తెలుస్తోంది. హీరోగా ప్రామిస్సింగ్ గా కనిపిస్తున్నాడు.

పూర్తిస్థాయి వినోదాత్మంగా రూపొందిన స్వాతిముత్యం మూవీలో వెన్నల కిషోర్, రావురమేశ్, సీనియర్ హీరో నరేశ్, ప్రగతి, సురేఖా వాణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాగర్ మహతి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, సూర్య సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇక నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించనున్నారు.

సితార బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన స్వాతిముత్యం వస్తూనే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. సినిమా కూడా ప్రామిస్సింగ్ గానే కనిపిస్తోంది కాబట్టి, అక్టోబర్ మొదటివారంలో సినిమా థియోటర్లలో సందడి చేసేందుకు ముస్తాబవుతోంది. మరి ఏ హడావిడీ లేకుండా టైటల్ కు జస్టిఫై చేస్తూ థియేటర్లలోకి వచ్చేస్తున్న స్వాతిముత్యం అన్న వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.