బాలయ్య కు రోజా హెచ్చరిక : తేడా వస్తే దబిడి దిబిడే – ఇక్కడ రియల్ సింహం..!!

సినీ హీరో..టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ‌ లక్ష్యంగా ఏపీ మంత్రులు వరుసగా విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో బాల‌కృష్ణ‌ స్పందించారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని..తెలుగు జాతి వెన్నుముకగా పేర్కొన్నారు. నాడు వైఎస్సార్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు తొలిగిస్తే..నేడు ఆయన కుమారుడు వర్సిటీ పేరు మార్చారని చెప్పుకొచ్చారు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారంటూ బాలయ్య సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. దీనికి ఏపీ మంత్రులు రియాక్ట్ అయ్యారు.

దీనికి కౌంటర్ గా మంత్రి అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్‌లో సెట్టైర్లు వేశారు. జోరు త‌గ్గించ‌వ‌య్యా..జోక‌ర్ బాల‌య్య అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. టూరిజం మంత్రి ఆర్కే రోజా కూడా ఈ వ్యవహారం పైన స్పందించారు. బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు. జగనన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం. తేడా వస్తే దబడి దిబిడే అంటూ హెచ్చరించారు. ఎన్టీఆర్..టీడీపీ హయాంలో ఒక్క ఆస్పత్రి కూడా కట్టకపోయినా, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎలా పెట్టుకున్నారంటూ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు.

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారు? పేరు పెడితే చేసిన పాపాం పోతుందా బాల‌కృష్ణ‌ా అంటూ ట్వీట్ ద్వారా నిలదీసారు. మరో మంత్రి గుడివాడ అమర్నాధ్ సైతం సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు వేయిస్తే, ఎన్టీఆర్ పేరు పెట్టి జగన్ పూలు వేయించారని పేర్కొన్నారు. మరో మంత్రి అప్పలరాజు కూడా బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచిన వారంతా ఎన్టీఆర్ భక్తులమని చెబుతారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన జగన్ పైన బురద చల్లుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఎవరి హయాంలో ఎన్ని అస్పత్రులు నిర్మించారనే లెక్కలు చెప్పుకొచ్చారు. టీడీపీ రాకముందు మూడు కాలేజీలు ఉంటే, వైఎస్సార్ మూడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారని అంజాద్ బాషా వివరించారు.

అటు టీడీపీ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ వర్సిటీకి వైఎస్సార్ పేరు మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. కానీ, రాజకీయంగా మాత్రం ఈ రగడ కొనసాగుతూనే ఉంది.