పింఛన్ దారులకు జగన్ మరో గుడ్ న్యూస్-పోర్టబులిటీ ఆప్షన్-సచివాలయాల్లోనే..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవంతంగా అమలు చేస్తున్న పెన్షన్లను లబ్దిదారులకు మరింత మెరుగ్గా అందించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పెన్షన్ల జారీ విధానంలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది అంతిమంగా తరచుగా నివాస ప్రాంతాల్ని మార్చుకునే వారికి సైతం లబ్ది చేకూర్చేలా ఉంది. దీంతో పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో పింఛన్ దారులకు సీఎం జగన్ వరుసగా గుడ్ న్యూస్ లు చెప్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పింఛన్లను ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ పోతున్న జగన్.. ఇప్పుడు వాటిని కూడా అసలైన లబ్దిదారులకు అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో సామాజిక అసమానతలు తగ్గించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ తాము నివసిస్తున్న ప్రాంతం మారితే పెన్షన్ రాదేమోనన్న బెంగకు జగన్ చెక్ పెట్టారు.

ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్ ఆసరా పథకం కింద ఇస్తున్న పెన్షన్లు తీసుకుంటున్నవారు తాము నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్నంతసేపు ఎలాంటి ఇబ్బందులు ఉండడం లేదు. కానీ వేరే ప్రాంతానికి ఇల్లు మారితే మాత్రం సమస్యలు తప్పడం లేదు. అలాగే వేరే ఊర్లకు మారిపోతే మరిన్ని సమస్యలు వస్తున్నాయి. దీంతో ఇల్లు మారితే పెన్షన్ పోయినట్లేనన్న భావన వారిలో పెరిగిపోతోంది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం తాజాగా వారికి పోర్టబులిటీ ఆప్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

పెన్షన్ లబ్దిదారులు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికి మారినా అక్కడికి తమ పెన్షన్ మార్చుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఇలా ఇల్లు మారే వారు తమ స్ధానిక గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్తగా ఫార్మాట్ ను కూడా అందుబాటులోకి తెస్తోంది. ఇలా ఇల్లు మారే పెన్షన్ లబ్దిదారులు మరిన్ని వివరాలకు స్ధానిక సచివాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పెన్షన్ మార్పుల్ని ప్రభుత్వం ఆమోదిస్తుంది. అప్పుడు వారికి కొత్తగా వారు నివాసముండే ప్రాంతాల పరిధిలోనే పెన్షన్ తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది.

అలాగే ప్రభుత్వం వద్ద డేటా కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంది.