నీ అంతు చూస్తా..! నీకు కూడా నందం సుబ్బ‌య్య గ‌తే ప‌డుతుంది?

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి బావ‌మరిది ప్ర‌ధాన అనుచ‌రుడు సుద‌ర్శ‌న్ రెడ్డి (క్రికెట్ బుకీ)పై వైసీపీకి చెందిన ప్రొద్దుటూరు 19వ వార్డు కౌన్సిల‌ర్ షేక్ మునీర్ టూటౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివ‌రాలు ఇలా వున్నాయి. ”శ‌నివారం సాయంత్రం ఐదుగంట‌ల స‌మ‌యంలో ఇంటివ‌ద్ద ఉండ‌గా ఓ నెంబ‌రు నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. నేను వెంట‌నే ఫోన్ లిఫ్ట్‌చేసి చెప్పండ‌న్నా అంటుండ‌గానే అస‌భ్య ప‌ద‌జాలంతో న‌న్ను దూషించారు.

మా అక్క‌ను అస‌భ్యంగా మాట్లాడ‌తావా అంటూ తిట్టాడు. నువ్వు ఇప్పుడు ఎక్క‌డున్నావో చెప్పు.. వెంట‌నే అక్క‌డికి వ‌చ్చి నిన్ను చంపి నీ అంతు చూస్తాం.. నీకు కూడా నందం సుబ్బ‌య్య గ‌తే ప‌డుతుందంటూ బెదిరించాడు” అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో అతను తన స్నేహితుడు దుగ్గిరెడ్డి రఘునాథ్‌రెడ్డిని కూడా ఇలాగే బెదిరించాడని, సుదర్శన్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, త‌న‌తోపాటు సహచర కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో మునీర్ కోరారు. ఎమ్మెల్యే బావమరిది పాతకోట బంగారు మునిరెడ్డి అండతో సుద‌ర్శ‌న్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నార‌ని, అత‌నితోపాటు అత‌ని అనుచ‌రుల‌పై చర్యలు తీసుకోవాలని మునీర్ కోరారు.

మునీర్ కు మద్దతుగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వర్గీయులు కొత్తపల్లి సర్పంచి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, 5, 22 వార్డు కౌన్సిలర్లు మురళీధర్ రెడ్డి, మహ్మద్ గౌస్, ఎమ్మెల్సీ సోదరుడు వెంకటప్రసాద్, దుగ్గిరెడ్డి రఘునాథ్ రెడ్డి తదితరులు మద్దతుగా నిలిచారు.

షేక్ మునీర్ ఫిర్యాదు చేసిన కొంతసేపటికే ఎమ్మెల్యే వర్గీయులు, ఎమ్మెల్సీ వర్గీయులు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, కానిస్టేబుల్స్, స్టేషన్ సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. మునీర్ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ వర్గీయులు వెనుదిరిగారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మల్సీ రమేష్ యాదవ్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పట్టణంలోని నాయకులంతా రెండు వర్గాలుగా విడిపోయారు. రానున్న ఎన్నికల్లో సీటు తనకే వస్తుందని, తానే ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నానని రమేష్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా పట్టణంలోని కౌన్సిలర్లు మొత్తం రెండు గ్రూపుల్లో చేరడంతో అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని ఇక్కడి విభేదాలను పరిష్కరించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.