నితీశ్ తేల్చేసారు : కేసీఆర్ నిర్ణయం పైనే – రేవంత్ రాజీ పడతారా..!!

జాతీయ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కొత్త భూమిక పోషించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కేసీఆర్ కేంద్ర బిందువుగా మారారు. అందులో భాగంగా అందరినీ ఏకం చేసేందుకు పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు- ముఖ్యమంత్రు లతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించారు.

కొద్ది రోజుల క్రితం బీహార్ వెళ్లి ముఖ్యమంత్రి నితీశ్ – లాలూ ప్రసాద్ యాదవ్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో తమ కూటమి నేత ఎవరనేది ముఖ్యం కాదని..అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని నితీశ్ – కేసీఆర్ సమిష్టిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి నుంచి తాము బీజేపీతో పాటుగా కాంగ్రెస్ కు దూరమని చెబుతూ వచ్చారు. గతం కంటే కాంగ్రెస్ పైన విమర్శల తీవ్రత తగ్గినా..బీజేపీ పైనే ప్రధానంగా ఫోకస్ చేసారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకోసం బీజేపీతో పోరాడుతునే..కాంగ్రెస్ తో దూరంగా ఉండాలని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం ద్వారా ఎన్నికల్లో అనకూల ఫలితాలు వస్తాయనేది టీఆర్ఎస్ వ్యూహం. అయితే, ఇప్పుడు నితీశ్ కీలక ప్రకటన చేసారు.

ప్రస్తుతం థర్డ్ ఫ్రంట్ లేదని.. కాంగ్రెస్​తో కలిసి ఒకటే కూటమిగా ఏర్పడితే 2024 ఎన్నికల్లో భాజపా ఘోరంగా ఓడిపోతుందని నీతీశ్ అన్నారు. ఈ ప్రకటన కేసీఆర్ తో సంప్రందించిన తరువాత చేసారా..లేక, ఆయనే ప్రకటించారా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. కాంగ్రెస్‌, లెఫ్ట్ సహా అన్ని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావాలని నితీశ్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. తాను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిని కానని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ అనే ప్రశ్నే లేదని.. కాంగ్రెస్​తో సహా ఒక ఫ్రంట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పార్టీలు లేకుండా కూటమిని ఊహించలేమని నీతీశ్ అన్నారు. దీంతో..ఇప్పుడు జాతీయ పార్టీ ప్రకటకు రంగం సిద్దం చేసుకుంటున్న కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసి పని చేయటానికి అంగీకరిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జాతీయ స్థాయిలో ఇక విధంగా.. తెలంగాణలో మరో విధంగా వ్యవహరించినా రాజకీయంగా నష్టం వాటిట్లే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రతీ సందర్భంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా యూపీఏ నుంచి పోటీ చేసిన యశ్వంత్ సిన్హా తొలుత కేసీఆర్ ను కలిసారనే కారణంగా, రేవంత్ హైదరాబాద్ కు వచ్చిన యశ్వంత్ ను కలవలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు.. జాతీయ రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కు ప్రత్యక్షంగా – పరోక్షంగా సంబంధాలు ఉంటే అది రేవంత్ కు రాజకీయంగా ఇబ్బంది తెచ్చి పెట్టే అవకాశం ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో జాతీయ స్థాయిలో పొత్తులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల పైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అధినాయకత్వం- కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే దానిని రేవంత్ నిలువరించే అవకావం ఉండదు. తాజాగా, కేరళలో పార్టీ నేత రాహుల్ తో సమావేశమైన తరువాత రేవంత్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదని చెప్పారు. కానీ, సమీకరణాలు మారుతున్నాయి. దీంతో..రేవంత్ వ్యూహాలు – అడుగుల పైన ఆసక్తి కనిపిస్తోంది.