దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం – గవర్నర్ తొలి దర్శనం..!!

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి అక్టోబర్‌ 5 వరకు జరగనున్న వేడుకల కోసం.. దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి ఆలయం, ఉపాలయాల్లోని మూర్తులకు.. స్నపనాభిషేకాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజైన నేడు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవిగా దర్శనిమిస్తారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకుని తొలి పూజలు చేయనున్నారు.

ఉత్సవాల రెండో రోజు నుంచి ఉదయం 4 గంటల మొదలు రాత్రి 11 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. రోజూ సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతులు,చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారి ఆలయంలో దసరా పది రోజులూ ప్రత్యేక పూజలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు , ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు విభాగాల్లో పూజలు నిర్వహిస్తారు. అక్టోబర్​ రెండో తేదీ అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలానక్షత్రం రోజున రెండు లక్షల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని పాలక మండలి- అధికారులు అంచనా వేస్తున్నారు.

కృష్ణానదిలో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నది స్నానాలను పూర్తిగా నిషేదించి.. ఘాట్ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం సుమారు 20 లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం సర్వదర్శనంతోపాటు వంద, మూడు వందల రూపాయల టిక్కెట్లను, వీఐపీలకు ఐదు వందల రూపాయల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో.. అప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేశారు. నాలుగు వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు.. 12 చోట్ల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ కాంతారాణా వెల్లడించారు. గతానికి భిన్నంగా ఆలయ ప్రాంగణం మొత్తం దేదీప్యమానమైన విద్యుత్తుదీపాలంకరణ, లేజర్‌షోలను ఏర్పాటు చేశారు. శ్రీ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారికి నిత్యం ప్రత్యేక అలంకరణతో పాటుగా కట్టే చీర రంగు – నైవేద్యం వివరాలను దేవాలయ అధికారులు వెల్లడించారు. విజయ దశమి నాడు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ఆలకంరణలో దర్శనమివ్వనున్నారు.