చైనా అధ్యక్షుడు గృహనిర్బంధం..! 60 శాతం విమానాల నిలిపివేత..!!

చైనాలో ఏం జరుగుతోంది. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఆ దేశ సైన్యం గృహనిర్బంధంలో ఉంచిందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. చైనా సైన్యం జిన్‌పింగ్‌ను హౌజ్‌ అరెస్టు చేసిందని, పీఎల్‌ఏ బాధ్యతల నుంచి తప్పించిందని వార్తలు వస్తున్నాయి. చైనా సైన్యానికి చెందిన భారీ కాన్వాయ్‌ దేశ రాజధాని బీజింగ్‌ దిశగా సాగుతున్నదని ప్రవాసంలో ఉంటున్న చైనా మానవ హక్కుల కార్యకర్త జెన్నిఫర్‌ జెంగ్‌ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దాదాపు 80 కిలోమీటర్ల పొడవున సైనిక వాహనాలు బీజింగ్‌ వైపు వెళ్తున్నాయని తెలిపారు.

బీజింగ్‌ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయనీ, బయటి ప్రపంచంతో చైనా రాజధాని నగరానికి సంబంధాలు తెగిపోయాయని ప్రచారం జరుగుతోంది. సైనాకాధికారి లీ కియావోమింగ్‌ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో.. చైనా నుంచి విదేశాలకు వెళ్లాల్సిన దాదాపు 60 శాతం విమానాలను శుక్రవారం నిరవధికంగా నిలిపేశారు. 9,583 దేశీయ, అంతర్జాతీయ విమానాలు, పలు హైస్పీడ్‌ రైళ్లు రద్దయినట్టు తెలుస్తోంది. అందుకు కారణాలను అధికారులు చెప్పటంలేదు. జిన్‌పింగ్‌ హౌస్‌ అరెస్టు వార్తలపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కూడా స్పందించారు. చైనాలో ఏం జరుగుతున్నదంటూ ప్రశ్నించారు.

జిన్‌పింగ్‌ హౌస్‌ అరెస్టు అయినట్టు వార్తలు వస్తున్నాయి.. నిజమేనా అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. చైనాలో భారీగా మంటలు చెలరేగుతున్నందుకే ఇంతలా పొగ వస్తున్నదని అమెరికాలో ప్రవాసం ఉంటున్న చైనా రచయిత గోర్డన్‌ చాంగ్‌ ట్వీట్‌ చేశారు. చైనా ఇప్పుడు సుస్థిరంగా లేదని పేర్కొన్నారు. ఉజ్బెకిస్థాన్‌లో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సు ముగించుకొని జిన్‌పింగ్‌ విమానం బీజింగ్‌లో దిగగానే ఆయనను హౌజ్‌ అరెస్టు చేసినట్టు ప్రచారం సాగుతున్నది. ప్రణాళికలో భాగంగానే.. జిన్‌పింగ్‌కు మోదీ, పుతిన్‌తో సమావేశాలను షెడ్యూల్‌ చేయలేదని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.