కాఫీ షాప్‌లో మహిళా మంత్రి నిర్బంధం – దొంగ అంటూ వేధింపులు: విచారణకు ఆదేశం

లండన్: ఆమె స్వయానా ఓ దేశానికి మంత్రి. సమాచార మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. యువ నాయకురాలు. వ్యక్తిగత పనుల కోసం లండన్ వెళ్లారు. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. స్వదేశీయులే ఆమెను వేధింపులకు గురి చేశారు. ఓ కాఫీ షాప్‌లో నిర్బంధానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి.

ఆ మంత్రి పేరు మర్యం ఔరంగజేబ్‌. పాకిస్తాన్ సమాచార మంత్రి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె. యువ నాయకురాలు. వ్యక్తిగత పనుల కోసం లండన్ వెళ్లిన ఆమెను అక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు వేధింపులకు గురి చేశారు. దొంగ దొంగ అంటూ వెంబడించారు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి ఓ కాఫీ షాప్‌లోకి వెళ్లగా.. ఆమెను అక్కడే నిర్బంధించారు. ఓ దశలో ఆమెపై చేయి చేసుకునేంత వరకూ వెళ్లిందక్కడి పరిస్థితి.

మర్యం ఔరంగజేబ్‌ను వేధించిన వారందరూ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులుగా భావిస్తోన్నారు. లండన్‌లో స్థిరపడిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులుగా ది డాన్ వెల్లడించింది. వరదలో అల్లాడుతున్న స్వదేశాన్ని వదిలి- ఇలా దొంగలా ఇంగ్లాండ్‌కు పారిపోయి వచ్చారంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. బుర్ఖా కూడా ధరించలేదంటూ విమర్శించడం ఈ వీడియో క్లిప్స్‌లో వినిపించింది.

ఈ ఘటన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. లండన్‌లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. వీడియోల ద్వారా నిందితులను గుర్తిస్తామని, వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పలువురు పాకిస్తాన్ మంత్రులు ఈ ఘటనపై స్పందించారు. ట్వీట్లు చేశారు.

మంత్రులు అంతమంది నిరసనకారులు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలిచినందుకు మర్యం ఔరంగజేబ్‌కు సెల్యూట్ చేస్తున్నానంటూ ఆర్థికమంత్రి మిఫ్తా ఇస్మాయిల్ చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు స్వదేశ పరువును మంటగలిగాపరంటూ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ విమర్శించారు. పాకిస్తాన్-ఇ-తెహ్రీక్ గూండాలు స్వదేశానికి చెందిన ఓ మహిళా మంత్రి పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని, దీనికి ఇమ్రాన్ ఖాన్ వివరణ ఇవ్వాలని ప్రణాళికా శాఖ మంత్రి ఎహ్‌సాన్ ఇక్బాల్ డిమాండ్ చేశారు.