Magnus Carlsen, Hans Niemann: ఇంటర్నేషనల్ చెస్ పోటీల్లోనూ మోసాలా? కార్ల్సన్, నీమన్‌లలో ఎవరి మాట నిజం

ఈ నెల ప్రారంభంలో(2022 సెప్టెంబర్) సింక్‌ఫీల్డ్ కప్ మూడో రౌండ్‌లో తలపడేందుకు మాగ్నస్ కార్ల్సన్, హాన్స్ నీమన్‌లు చెస్ బోర్డు ముందు కూర్చున్నప్పుడు జరగబోయే గందరగోళాన్ని చాలామంది ఊహించలేదు.

టోర్నీలో అత్యంత తక్కువ ర్యాంక్ ఉన్న19 ఏళ్ల అమెరికన్ ఆటగాడు నీమన్ దశాబ్దం పాటు చదరంగాన్ని ఏలిన అనుభవజ్ఞుడైన ఆటగాడి ఎదురుగా కూర్చున్నాడు.

నార్వేకు చెందిన 31 ఏళ్ల కార్ల్సన్ గత 53 ఆటల్లో ఓటమి అనేదే చూడలేదు. అంతేకాదు, ఈ ఆటలో తెల్ల పావులతో ఆడుతుండడంతో తొలి ఎత్తు వేసే అవకాశమూ కార్ల్సన్‌దే.

నీమన్ భయపడినట్లు అనిపించినా దాన్ని కనిపించినివ్వలేదు. కార్ల్సన్ తొలి ఎత్తును తిప్పికొట్టిన నీమన్ క్రమంగా ఆటపై పట్టు బిగించాడు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్ల్సన్ ఆట నుంచి వైదొలిగాడు.

ఈ ఆట ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ ఆట తరువాత ఇంకా 6 రౌండ్లు ఉన్నప్పటికీ కార్ల్సన్ ఎలాంటి వివరణా ఇవ్వకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. చెస్‌లో పైస్థాయిలో ఇలా చేయడం గతంలో ఎన్నడూ లేదు.

కార్ల్సన్ ఎందుకు నిష్క్రమించాడా అని ఇతర ఆటగాళ్లు, అభిమానులు, విమర్శకులు అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ఒక ట్వీట్ చేశాడు. ‘నేను మాట్లాడితే ప్రమాదంలో పడతాను’ అంటూ ఫుట్‌బాల్ మేనేజర్ జోస్ మోరిన్హో 2020లో చెప్పినప్పటి యూట్యూబ్ వీడియోను కార్ల్సన్ ట్విటర్‌లో షేర్ చేశాడు.

కార్ల్సన్ ట్వీట్ తరువాత ఏదో మోసం జరిగిందన్న అనుమానాలు చాలామందికి కలిగాయి. నీమన్ పేరును ప్రస్తావించనప్పటికీ, ఎలాంటి ఆధారం చూపించనప్పటికీ కార్ల్సన్ ట్వీట్ చాలా స్పష్టంగా ఉంది.

కార్ల్సన్ సెప్టెంబర్ 5న ఈ ట్వీట్ చేయగా సెప్టెంబర్ 8న ఆన్‌లైన్ చెస్ ప్లాట్‌ఫాం chess.com ఓ ప్రకటన చేసింది. తమ సైట్‌లో మోసానికి పాల్పడినందున నీమన్‌ను తొలగించినట్లు చెస్.కామ్ ప్రకటించింది.

ఆరోపణలు వెల్లువెత్తడంతో నీమన్ తన 12 ఏళ్ల వయసులో ఓసారి, 16 ఏళ్ల వయసులో ఓసారి వేర్వేరు సందర్భాలలో కంప్యూటర్ సహాయంతో మోసానికి పాల్పడినట్లు అంగీకరించాడు.

కానీ, బోర్డులో మోసానికి పాల్పడినట్లు మాత్రం ఆయన అంగీకరించలేదు. తన సచ్ఛీలతను నిరూపించుకోవడానికి కావాలంటే నగ్నంగా ఆడేందుకు కూడా సిద్ధమని నీమన్ చెప్పాడు.

కార్ల్సన్, చెస్.కామ్, ప్రపంచంలో అత్యధికులు ఫాలో అయ్యే చెస్ స్ట్రీమర్ హికరు నకమురాలు తన కెరీర్ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ నీమన్ ఆరోపించాడు.

‘నేను నగ్నంగా కూర్చుని ఆడాలని వారు కోరుకుంటే, అలాగే చేస్తాను’ అన్నాడు నీమన్.

‘నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ నేను పట్టించుకోను. ఎలాంటి ఎలక్ట్రానిక్ ప్రసారం లేని క్లోజ్డ్ బాక్స్‌లో కూర్చుని ఆడమన్నా ఆడుతాను. నేనిక్కడ గెలవడానికి ఉన్నాను.. అదే నా లక్ష్యం కూడా’ అన్నాడు నీమన్.

కాగా చదరంగంలో మోసానికి పాల్పడే ఆలోచనలు ఇదే తొలిసారి కాదు. కానీ, స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు మోసాలను సులభం చేసేశాయి.

ఉచితంగా దొరికే కొన్ని మంచి చెస్ యాప్స్ టాప్ ప్లేయర్ల కంటే తెలివిగా ఆడుతాయి.

గేమ్‌ను యాప్‌లోకి ఇన్‌పుట్ చేస్తే గెలవడానికి వేయాల్సిన కచ్చితమైన ఎత్తులను అదే సూచిస్తుంది. అందువల్లే ఆట జరుగుతున్న సమయంలో ఫోన్ వినియోగాన్ని నిషేధించారు.

అయినప్పటికీ రహస్యంగా ఫోన్లను, ఇతర డివైస్‌లను వాడి దొరికిపోయిన సందర్భాలున్నాయి.

ఓ ఆటగాడు కాలికి ఫోన్ కట్టుకుని ఒక మైక్రో ఇయర్ ఫోన్‌ను చెవిలో పెట్టుకుని ఫోన్లోని యాప్ నుంచి వస్తున్న సూచనల ప్రకారం ఆడుతూ దొరికిపోయిన ఉదంతం ఉంది.

చెస్‌లో చీటింగ్ అనేది చాలాకాలంగా ప్రధాన సమస్యగా ఉందని.. స్కూల్ స్థాయి మ్యాచ్‌లలో కూడా ఒక్కోసారి ఆటగాళ్ల తల్లిదండ్రులు, కోచ్‌లు ఆటను ప్రత్యక్షంగా చూడకుండా నిషేధం ఉంటోందని మహిళా గ్రాండ్ మాస్టర్ సుసాన్ పోల్గర్ బీబీసీతో చెప్పారు.

ఒకేసారి వేర్వేరు ఆటగాళ్లతో ఆడినప్పుడు తాను ఇలాంటి మోసం చూశానని చెప్పారు.. ఒక ప్లేయర్ స్నేహితుడు స్మార్ట్ ఫోన్ పట్టుకుని అక్కడే నిల్చుని అందులోని సలహాను ఆటగాడితో చర్చించడం గమనించానని ఆమె చెప్పారు.

అయితే, పైస్థాయి చెస్ పోటీల్లో కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ ఇప్పటికీ మోసానికి అవకాశాలున్నాయని ఆమె చెప్పారు.

గ్రాండ్ మాస్టర్ స్థాయిలో వారు వేసే ప్రతి ఎత్తుకు కంప్యూటర్ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు.. అయినా, నీమన్ లాంటి టాప్ ప్లేయర్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయంటే అది అసాధరణ పరిణామమేనని చెప్పారు సుసాన్.

2006లో ‘టాయిలెట్ గేట్’ స్కాండల్ తరువాత చెస్‌లో ఇంతవరకు అలాంటి కుంభకోణాలేవీ రాలేదు. అప్పుడు చాంపియన్ వ్లాదిమిర్ క్రామ్నిక్ అనుమానాస్పద రీతిలో పదేపదే బాత్రూమ్‌కు వెళ్లారని, ఆయన ఆటలో మోసానికి పాల్పడ్డారని వరల్డ్ చాంపియన్‌షిప్ చాలెంజర్ వేజలిన్ తొపలోవ్ బృందం ఆరోపించింది.

అయితే, చెస్‌లో మోసాలను గుర్తించడంలో నిపుణుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రొఫెసర్ కెన్నెత్ రీగన్ చేసిన గణాంక విశ్లేషణ మాత్రం క్రామ్నిక్ ఎలాంటి మోసానికి పాల్పడలేదని చెప్పింది.

మరికొన్ని సార్లు ఆరోపణలు అసంబద్ధంగానే మిగిలిపోయాయి.

1978లో వరల్డ్ చాంపియన్ అనతోలీ కార్పోవ్‌పై విక్టర్ కోర్చ్‌నోయి ఇలాంటి ఆరోపణలే చేశారు. కార్పోవ్‌కు ఆయన టీం ఆట సమయంలో బ్లూబెర్రీ యోగర్ట్ పంపించిందని.. అంది కచ్చితంగా ఏదో నిర్దిష్టమైన ఎత్తు వేయాలని చెప్పడానికి సంకేతమని కోర్చ్‌నోయి ఆరోపించారు.

కోర్చ్‌నోయి, కార్పోవ్‌ల మధ్య జరిగిన ఆ మ్యాచ్ అపనమ్మకాల, ద్వేషం మధ్య సాగింది. కోర్చ్‌నోయిని అదే పనిగా గమనించడానికి ఎదురుగా ఒక హిప్నాటిస్ట్‌ను కార్పొవ్ టీం కూర్చోబెట్టగా.. ఆయన్నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఎదుటివారికి ప్రతిబింబం కనిపించేలాంటి ప్రత్యేకమైన సన్ గ్లాసెస్ ధరించి ఆడాడు కోర్చ్‌నోయి.

ఇక తాజా వివాదానికి వస్తే.. కార్ల్సన్ ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో చెస్ ప్రపంచమంతా నీమన్ ఆటలను, ఇంటర్వ్యూలను నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది.

మరికొందరైతే గత 20 నెలల్లో నీమన్ 800వ ర్యాంక్ నుంచి ఏకంగా 50 లోపు ర్యాంక్‌కు చేరుకోవడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

నీమన్ ఎదుగుదల అసాధారణంగా ఉందని నకముర అంటుండగా.. ఇతర జూనియర్ ఆటగాళ్లలోనూ ఇలాంటి ప్రగతి కనిపించిన సందర్భాలున్నాయని మరికొందరు అంటున్నారు.

మరోవైపు చెస్ ప్రపంచానికి చెందిన ఇంకొందరు నీమన్‌పై సానుభూతి చూపుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఒక యువ ఆటగాడిపై నిందలు వేసి ప్రతిష్ట మసకబారుస్తున్నారంటున్నారు.

స్వయంగా అంతర్జాతీయ మాస్టర్ అయిన విశ్లేషకుడు కెన్నెత్ రీగన్ కూడా ఈ ఆటను పరిశీలించి నీమన్ మోసానికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారం లభించలేదని తేల్చారు.

వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడిన ఏకైక బ్రిటిష్ ఆటగాడు గ్రాండ్ మాస్టర్ నిగెల్ షార్ట్ కూడా కార్ల్సన్‌పై విజయం సాధించిన మ్యాచ్‌లో నీమన్ మోసానికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారం లేదని చెప్పారు.

ఆరోపణలు రుజువైతే కెరీర్‌ అక్కడితో ముగిసిపోతుందని.. కాబట్టి టాప్ లెవల్‌లో ఇలాంటి మోసం ఉండకపోవచ్చని షార్ట్ ‘బీబీసీ’తో అన్నారు.

తక్కువ ప్రైజ్ మనీ ఉండే చిన్నచిన్న టోర్నీలలో జీవనోపాధి కోసం పోటీపడే ఆటగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడితే పాల్పడొచ్చని షార్ట్ అన్నారు.

ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా కార్ల్సన్‌పై ఉండే ఒత్తిడి వల్ల ఓటమి తరువాత ఆయన ఇలాంటి ఆరోపణలకు చేసి ఉండొచ్చని షార్ట్ అభిప్రాయపడ్డారు.

కార్ల్సన్ 2013 నుంచి వరల్డ్ చాంపియన్‌గా కొనసాగుతున్నాడు. అంతకుముందు నుంచే ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్నాడు.

ఆధారాలు లేకుండా నీమన్‌ను అనుమానించలేమని.. నిరాధార ఆరోపణలు చేయడం కార్ల్సన్‌కు నైతికంగా సరికాదని సుసాన్ అన్నారు.

ఇదేమీ చిన్నాచితకా ఆరోపణ కాదని, ఈ ఆరోపణ చెస్ ప్రపంచంలో ఎలాంటి కుదుపు తెస్తుందో ఆయనకు తెలియకుండా ఉండదని అన్నారు.

కాగా ఈ వివాదం సోమవారం మరో మలుపు తిరిగింది. ఒక కీలక ఆన్‌లైన్ టోర్నీలో ఈ ఇద్దరు ఆటగాళ్లు మళ్లీ సోమవారం తలపడగా నీమన్ ఆడుతున్నందుకు నిరసనగా కార్ల్సన్ ఒక ఎత్తు వేసిన తరువాత ఆట నుంచి వైదొలిగాడు.

టోర్నీ ముగిశాక ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నట్లు కార్ల్సన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)